సకాలంలో రహదారుల నిర్మాణం

    రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతుల పనుల కోసం పిలిచిన టెండర్లను జూలై 15 నాటికి ఖరారు చేసి పనులు ప్రారంభించాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ అధికారులను ఆదేశించారు. ఆర్‌ అండ్‌ బీ శాఖ ఉన్నతాధికారులతో విజయవాడలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ అండ్‌ బీ శాఖలో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఎన్టీబీ మొదటి దశ, రెండో దశ కింద చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు–నేడు కింద ప్రాథమిక ఆసుపత్రులు, ఇతర ఆసుపత్రుల భవనాల మరమ్మతులు, ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం పనుల ఒప్పందాలను త్వరిత గతిన ఖరారు చేయాలన్నారు. రహదారుల పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఈఎన్‌సీలు వేణుగోపాల్‌రెడ్డి, ఇనయతుల్లా, పలువురు చీఫ్‌ ఇంజనీర్లు, అన్ని జిల్లాల సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/timely-construction-roads-andhra-pradesh-1370344