సచివాలయాల్లో ఆధార్‌ సేవలు

  • అల్లూరి సీతారామరాజు జిల్లా వడ్డిగూడెం సచివాలయంలో ఆధార్‌ సేవలందిస్తున్న సిబ్బంది
  • అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
  • రాష్ట్ర వ్యాప్తంగా 3,000 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాట్లు
  • ఇప్పటికే 1,100 కేంద్రాల్లో ప్రారంభమైన ఆధార్‌ సేవలు
  • మొదటి సారి ఆధార్‌ నమోదు చేసుకునే వారికి పూర్తి ఉచితం
  • కలర్‌ ప్రింట్, అడ్రస్‌ మార్పు తదితర సేవలకు యూఐడీఏఐ నిర్ధారిత చార్జి
  • విధివిధానాలపై జిల్లా కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు  గ్రామ వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. తొలిసారి ఆధార్‌ వివరాలు నమోదు చేసుకునే వారికి పూర్తి ఉచితంగా సేవలు అందజేస్తారని ఆ శాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకునే వారికి కూడా ఒకసారి ఉచిత సేవలు అందిస్తారని వెల్లడించింది.javascript:false

అయితే, ఆధార్‌ కలర్‌ ప్రింట్, బయోమెట్రిక్‌లో తప్పులు సరిదిద్దడం, అడ్రసు తదితర వివరాల్లో మార్పులకు ఆధార్‌ నమోదు సంస్థ(యూఐడీఏఐ) నిర్ధారించిన సర్వీసు చార్జి ఉంటుందని పేర్కొంది. సచివాలయాల్లో ఆధార్‌ సేవలు నిర్వహణకు సంబంధించి విధివిధానాలపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌ షాన్‌మోహన్‌ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 

ప్రతి ఐదు సచివాలయాలకు ఒకటి..
రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల సచివాలయాల్లో ఈ ఆధార్‌ సేవా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు షాన్‌ మోహన్‌ ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. ప్రతి ఐదు సచివాలయాల్లో ఒకటి చొప్పున, సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలు, వార్డుల వారికి సమాన దూరంలో ఉండేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

కాగా, ఆధార్‌ సేవల కోసమే ప్రత్యేకంగా ల్యాప్‌టాప్, మానిటర్, కెమెరా, మల్టీ ఫంక్షనల్, ఐరిస్, ఫింగర్‌ ప్రింట్‌ డివైస్, వైట్‌ స్క్రీన్, ఫోకస్‌ లైట్, జీపీఎస్‌ డివైస్, ప్రొటెక్టర్, వీజీఏ టూ హెచ్‌డీఎంఐ కన్వర్టర్‌ సహా మొత్తం 15 రకాల ఎలక్ట్రానిక్‌ పరికరాలతో కూడిన కిట్‌ను ప్రభుత్వం ఆయా సచివాలయాలకు సరఫరా చేస్తోంది.

ఇప్పటికే రెండు దశల్లో మొత్తం 1,100 సచివాలయాలకు ఆ కిట్‌లను కూడా అందజేశారు. మిగిలిన చోట్లకి సరఫరా ప్రక్రియ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కిట్‌లు అందుకున్న సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్‌ సేవలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. 

డిజిటల్‌ అసిస్టెంట్లకు శిక్షణ..
సచివాలయాల్లో ఆధార్‌ సేవలు నిర్వహణకు సంబంధించి డిజిటల్‌ అసిస్టెంట్, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్లను ఆధార్‌ సేవలకు మాత్రమే పరిమితం చేయాలని, వారికి మరే ఇతర సేవలు కేటాయించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ఏదైనా ఆధార్‌ సేవలందించే సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ అందుబాటులో లేకపోతే.. సమీపంలోని మరో సచివాలయంలో ఆధార్‌ సేవలు ప్రారంభించాలని కలెక్టర్లకు సూచించారు. ఆధార్‌ సేవలు అందుబాటులో ఉన్న సచివాలయాల వివరాలను లోకల్‌ టీవీ చానళ్లు ద్వారా విస్తృతంగా ప్రచారం కూడా కల్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కేంద్రాలు నిర్వహించి ఆధార్‌ నమోదు, బయోమెట్రిక్‌ వివరాలు అప్‌డేట్‌ తదితర సేవలు అందజేయాలని కలెక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు.  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/aadhaar-services-village-secretariats-andhra-pradesh-1461238