సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థ వైపు ఇతర రాష్ట్రాల చూపు

 

  • ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల బృందం రాష్ట్ర పర్యటన 
  • దేశమంతటా అమలుకు నీతి ఆయోగ్‌ సభ్యులతో కూడిన కామన్‌ రివ్యూ మిషన్‌ ప్రతిపాదన  
  • సచివాలయ వ్యవస్థతో కలిసి పని చేయడానికి యునిసెఫ్‌ ఆసక్తి 
  • కొత్త వ్యవస్థల ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన 
  • ఉన్న ఊళ్లలోనే 3.7 కోట్ల వినతుల పరిష్కారం 
  • అవినీతిలేకుండా రూ.1.34 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు చేరవేత 
  • కరోనా సమయంలో వలంటీర్ల పనితీరును ప్రశంసించిన ప్రధాని   
  • ఈ వ్యవస్థ ద్వారా 24 నెలల్లో 44 విడతలు ఫీవర్‌ సర్వే 
  • వ్యాధి నిర్ధారణ, సత్వర చికిత్సకు చర్యలు.. తద్వారా మన రాష్ట్రంలోనే మరణాల సంఖ్య తక్కువ 
  • మిగతా రాష్ట్రాలతో పోల్చితే కనీసం పది వేల మంది ప్రాణాలకు అడ్డుకట్ట 

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది రాష్ట్రంలో ప్రభుత్వ తీరు. కానీ ఇంటిని రచ్చ రచ్చ చేయాలనేది ప్రతిపక్షం తీరు. సచివాలయాలను గ్రామాల్లోకి తీసుకెళ్లినా.. వలంటీర్ల సైన్యాన్ని ప్రభుత్వ ప్రతినిధులుగా ఊళ్లలో నిలబెట్టినా.. ఇంగ్లిష్‌ మీడియాన్ని సర్కారీ స్కూళ్లలో అందుబాటులోకి తెచ్చినా.. ఇవన్నీ విపక్షానికి నచ్చనివే. న్యాయస్థానాలక్కూడా వెళ్లి రచ్చ చేసినవే. కాకుంటే ఈ వ్యతిరేకత ప్రభుత్వ సంకల్పానికన్నా బలమైనదేమీ కాదు. కాబట్టే ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. అంతే కాదు. ఇతర రాష్ట్రాలక్కూడా ఆంధ్రప్రదేశ్‌ ఒక ‘రోల్‌ మోడల్‌’గా మారింది. ఆర్‌బీకేలు, నాడు–నేడు, రేషన్‌ డోర్‌ డెలివరీ, సంచార వైద్యశా లలు… ఇలా అన్నింటా ఏపీ ఒక మోడల్‌గా మారింది. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి చూడటమే కాదు… తమ తమ రాష్ట్రాల్లో అమలుకు కసరత్తు కూడా మొదలెట్టారు.కొన్ని అంశాలనైతే ఏకంగా కేంద్రమే దేశమంతటా అమల్లోకి తేవాలనుకుంటోంది. అదీ.. ఏపీ!!

డ్రగ్స్, శ్రీలంక… అంటూ ఏదోలా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్షం కూడా ఒక రోల్‌ మోడలే!! ఎక్కడా ఇలాంటి పక్షం ఉండకూడదని చెప్పటానికి. 

సాక్షి, అమరావతి: ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలో ప్రభుత్వం!. ఏ పథకాన్నయినా ఇంటిదాకా తెచ్చే ప్రభుత్వ వారధులు!!. ఆదేశిస్తే రాష్ట్రంలో ఇంటింటినీ ఒకే రోజులో చుట్టుముట్టేయాలన్న విజన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన సేవా సైన్యమిది. కోవిడ్‌ మహమ్మారి కొత్తగా ప్రవేశించిన రోజుల్లో మనిషిని చూసి మనిషి భయపడే పరిస్థితులు రాజ్యమేలాయి. మృతులు సొంతవారైనా కడచూపులూ దక్కని పరిస్థితి. అలాంటి సమయంలో రాష్ట్రంలో ఇంటింటికీ తిరిగి ట్రేస్‌–టెస్ట్‌–ట్రీట్‌ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది మన వలంటీర్లే. అందుకే ఇతర రాష్ట్రాలూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. కేంద్రం కూడా సచివాలయాల్ని దేశమంతా ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు దీనిపై ఇప్పటికే ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసివెళ్లాయి.  

సర్వత్రా ఆసక్తి 
రాష్ట్రంలో అమలవుతోన్న పలు పథకాల పట్ల ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను పలు రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. ఈ విధానాన్ని కర్ణాటకలోనూ అమలు చేసేందుకు ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ ప్రియాంక మేరీ ప్రాన్సిస్‌ నేతృత్వంలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు, మరో పది మంది రాష్ట్ర స్థాయి అధికారుల బృందం 2020 నవంబర్‌లో అనంతపురం జిల్లాలోని పలు గ్రామ సచివాలయాలను సందర్శించింది. మహారాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల బృందం నెల రోజుల క్రితం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు గ్రామ సచివాలయాలను సందర్శించింది.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పథకాలు రాష్ట్రాల్లో అమలవుతున్న తీరుపై అధ్యయనం చేసేందుకు తమిళనాడు రాష్ట్ర రిటైర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాజీవ్‌ రంజన్‌ నేతృత్వంలో ‘కామన్‌ రివ్యూ మిషన్‌ (సీఆర్‌ఎం)’ను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక నిపుణుల కమిటీ సైతం రాష్ట్రంలో పర్యటించిన అనంతరం మన సచివాలయ, వలంటీర్ల తరహా వ్యవస్థలు దేశమంతటా అమలు చేయాలని  కేంద్రానికి ప్రతిపాదించింది. కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్, నీతి ఆయోగ్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీ పీఆర్‌) విభాగాల ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

కరోనా సమయంలో ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో.. మన రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ద్వారా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే యునిసెఫ్‌ సైతం రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో ఒప్పందం చేసుకుంది. యునిసెఫ్‌ ప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి తమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.   
గ్రామ సచివాలయ వ్యవస్థను పరిశీలించడానికి రాష్ట్రానికి వచ్చిన కర్ణాటక ఐఏఎస్‌ అధికారుల బృందం (ఫైల్‌) 

17 ఏళ్లుగా కేంద్రం ప్రయత్నం.. 
కేంద్రంలో పంచాయతీ రాజ్‌కు ప్రత్యేక మంత్రిత్వ శాఖను 2005లో మొదటి సారిగా ఏర్పాటు చేసినప్పటి నుంచి దేశమంతటా గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే వ్యవస్థల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. దేశమంతటా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కనీస స్థాయిలో ఫర్నిచర్, ఒక కంప్యూటర్, ఇంటర్నెట్‌ వంటి సౌకర్యాలు కల్పించాలనుకుంటోంది. కంప్యూటర్‌ నిర్వహణకు కనీసం కాంట్రాక్టు పద్దతిలోనైనా ఉద్యోగుల నియమాకం చేయాలనుకుంది. ప్రతి గ్రామంలో ‘కామన్‌ సర్వీసు సెంటర్లు’ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తూనే ఉంది.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘రాజీవ్‌ గాంధీ పంచాయత్‌ స్వశక్తీరణ అభియాన్‌ (ఆర్‌జీపీఎస్‌ఏ), ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చాక ‘రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ)’ పేర్లతో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి నిధులతో ఆయా కార్యక్రమాలను అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండే 2.78 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం గ్రామ పంచాయతీ భవనం లేని చోట్ల వాటి నిర్మాణం, ఉన్న చోట మరమ్మతులకు ఈ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తున్నారు.

అయినప్పటికీ గత 17 ఏళ్లుగా అనుకున్న రీతిలో ఫలితాలు సాధించ లేదు. ఆర్‌జీఎస్‌ఏ కార్యక్రమాన్ని మరో ఐదేళ్ల పాటు 2026 వరకు కొనసాగించాలని ఈ నెల 13వ తేదీన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2015–17 మధ్య కాలంలో ఆర్‌జీఎస్‌ఏ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో గ్రామ స్థాయిలో పరిపాలనను పటిష్టం చేసేందుకు గ్రామ పంచాయతీల్లో పరిమిత కాలానికి దాదాపు 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకునేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం నిధులు మంజూరు చేసినా, పరిమిత కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగించాల్సి వస్తుందనే భయంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం సమ్మతించలేదు.  ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్లించింది.

నాలుగు నెలల్లో వ్యవస్థకు రూపం 
► ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండున్నర నెలల్లో గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో ప్రతి 75–100 ఇళ్లకు ఒకరి చొప్పున వలంటీర్లను నియమించారు. ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు.  
► 2019 అక్టోబర్‌ 2 తేదీ నాటికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి, ఒక్కో చోట 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. 
► గ్రామ, వార్డు సచివాలయాల కోసం 1.34 లక్షల మంది కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. కేవలం నాలుగు నెలల్లోనే వాటి భర్తీ ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. మొత్తంగా నాలుగు నెలల్లోనే 4 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. సరిపడా కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫోన్, ఇంటర్‌ నెట్‌ సౌకర్యం కల్పించారు.   
► అన్ని గ్రామాల్లో ప్రతి రోజు సాయంత్రం 3 – 5 గంటల మధ్య ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు ఊరు దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 545 రకాల ప్రభుత్వ సేవలు 2020 జనవరి 26 నుంచి అన్ని సచివాలయాల్లో అందుబాటులోకి వచ్చాయి.  రెండున్నర ఏళ్లలో 3.70 కోట్ల ప్రజా వినతులను   ప్రభుత్వం ఈ వ్యవస్థ ద్వారా పరిష్కరించింది.  
► అవినీతికి తావులేకుండా బయోమెట్రిక్‌ ద్వారా గత 34 నెలల్లో రూ.1.34 లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వివిధ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నేరుగా పంచి పెట్టింది. 

కరోనా వేళ వేలాది మంది ప్రాణాలకు అడ్డుకట్ట 
► రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో 23.19 లక్షల మందికి కరోనా సోకితే, ఇందులో 14,730 మంది మరణించారు. పంజాబ్‌ రాష్ట్రంలో 7.59 లక్షల మందికి కరోనా సోకితే, అందులో 17,743 మరణించారు. 18 లక్షల మందికి కరోనా సోకిన ఢిల్లీ వంటి రాష్ట్రంలో సైతం 26 వేల మందికి పైబడి చనిపోయారు.  
► 20 లక్షల మంది చొప్పున కరోనా సోకిన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో 26 వేల మంది చొప్పన మరణించారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో సైతం తక్షణమే సమర్థవంతంగా అమలు చేసి చూపించే సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ఉండడం వల్లే ఈ రెండేళ్ల కాలంలో కనీసం పది వేల మంది ప్రాణాలను ప్రభుత్వం కాపాడగలిగిందని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 
► 2020 మార్చిలో రాష్ట్రంలో కరోనా మొదలయ్యాక ఈ 24 నెలల కరోనా సమయంలో వలంటీర్ల ద్వారా 44 విడతలుగా ఫీవర్‌ సర్వే నిర్వహించారు. ఎప్పటికప్పుడు పాజిటివ్‌ రోగులను ప్రాథమిక దశలోనే గుర్తించి, తక్షణమే వైద్య సహాయం అందేలా చూశారు. తదితర కారణాల వల్ల మన రాష్ట్రంలో మరణాల సంఖ్య బాగా తక్కువకు పరిమితమైంది. కేసుల సంఖ్యలో ఐదవ స్థానం, మరణాల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఏపీ అనుకూలం 
దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మరింత పెంచేందుకు తొమ్మిది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తోంది. ఈ లక్ష్యాలను సాధించాలంటే క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీలకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారం తప్పనిసరి. ఇలా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మినహా మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ పరిస్థితులలో కేంద్రం అనుకుంటున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆంధ్రప్రదేశ్‌ చాలా అనుకూలంగా ఉంది.  
– మహ్మద్‌ తఖియుద్దీన్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీ) సీనియర్‌ కన్సల్టెంట్‌.  

అందుబాటులో 540కి పైగా ప్రభుత్వ సేవలు 
ప్రభుత్వ సేవలు పెరిగినప్పుడే ప్రజల ఆర్థిక పరిస్థితి తప్పనిసరిగా మెరుగు పడుతుంది. ఉదాహరణకు..  ఎవరైనా ఏదైనా పని కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే పూర్తయితే అతనికి తక్కువలో తక్కువ రూ.500 అయినా మిగిలినట్టే. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ  ద్వారా అన్ని గ్రామాల్లో ప్రజలకు 540కి పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ పథకాల కోసం లంచాలు ఇచ్చుకునే పరిస్థితి బాగా తగ్గిపోయింది. ఫలితంగా ప్రజల ఆశయాలు పెరుగుతాయి.  
– ప్రసాదరావు, ఆర్థిక శాస్త్ర రిటైర్డ్‌ ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం   

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/central-govt-and-other-states-focus-andhra-pradesh-1449353