సమగ్ర భూ సర్వేలో సచివాలయ సర్వేయర్లు

  • సెర్ప్‌ సర్వేయర్లను కూడా ఉపయోగించుకోవాలి
  • వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష అమలుపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష 
  • ఆగస్టు 15న వంద గ్రామాల్లో ప్రాపర్టీ కార్డుల పంపిణీ

  సమగ్ర భూ సర్వేలో గ్రామ, వార్డు సచివాలయాల సర్వేయర్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లోని కమ్యూనిటీ సర్వేయర్లను ఉపయోగించుకోవాలని మంత్రివర్గం ఉపసంఘం అధికారులకు సూచించింది. ఈ మేరకు వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా సర్వేలో భాగంగా ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని మొత్తం ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఎంత సమయం పడుతుందో అధ్యయనం చేయాలని సూచించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సర్వే రాళ్లకు సంబంధించి గుంతలు తవ్వడం తదితర పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించింది.

  గ్రామకంఠం సమస్యపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉందని తెలిపింది. ఎక్కడా పొరపాట్లు లేకుండా యాజమాన్య హక్కు సర్టిఫికెట్లను అందించే ప్రక్రియను చేపట్టాలని సూచించింది. భూరికార్డులను ఆధునికీకరించే ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కోరింది. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. కాగా, ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా వంద గ్రామాల్లో గ్రామకంఠం పరిధిలో అర్హులైన వారికి భూయాజమాన్య హక్కు కార్డులను జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 2 నాటికి వెయ్యి గ్రామాల్లో పంపిణీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

  గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో తాడేపల్లిగూడెంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. 762 గ్రామాలకు విలేజ్‌ మ్యాప్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. సకాలంలో సర్వేను పూర్తి చేయాలంటే కనీసం 51 డ్రోన్‌లు అవసరమవుతాయన్నారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డ్రోన్‌ కార్పొరేషన్‌ ద్వారా డ్రోన్‌లను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కృష్ణదాస్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/village-ward-secretariat-surveyors-comprehensive-land-survey-1385101