సర్కార్‌ బడికి కొత్త లుక్‌

  • ఫ్రెంచ్‌ సాయంతో మరింత ప్రగతి 
  • రూ.65 కోట్లతో 40 జీవీఎంసీ స్కూల్స్‌ అభివృద్ధి 
  • రూ.52 కోట్ల గ్రాంట్‌ అందిస్తున్న ఎఎఫ్‌డీ 
  • జీవీఎంసీ వాటా రూ.13 కోట్లు 
  • పాఠశాలల ఎంపిక పూర్తి చేసిన కార్పొరేషన్‌  
  • రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సన్నాహాలు

  డిజిటల్‌ తరగతులు.. క్రీడా మైదానాలు.. ఆవరణలో పచ్చదనం.. విద్యార్థుల ఆరోగ్యం.. ఇతర మౌలిక సదుపాయాలతో కార్పొరేషన్‌ పాఠశాలలు భాసిల్లుతున్నాయి. జీవీఎంసీ తీర్చిదిద్దిన ఈ మోడల్‌ స్కూళ్లను చూసి అచ్చెరువొందిన ఫ్రెంచ్‌ ప్రతినిధులు మరికొన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు. ఈ పాఠశాలలను మరింత స్మార్ట్‌గా మార్చేందుకు ఫ్రెంచ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏఎఫ్‌డీ) రూ.52 కోట్ల గ్రాంట్‌ అందించనుంది.   
  సిటీస్‌ అంటే ఏంటి.? 
  నగరాన్ని స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేసేందుకు విభిన్న ప్రాజెక్టులతో ముందుకెళ్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. సిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ టు ఇన్నోవేటివ్, ఇంటిగ్రేటెడ్‌ అండ్‌ సస్టైన్‌ (సిటీస్‌) ఛాలెంజ్‌ పేరుతో 2019లో జరిగిన పోటీలో 15 నగరాలకు సంబంధించి మొత్తం 26 ప్రాజెక్టులు ఎంపికవ్వగా.. ఇందులో జీవీఎంసీకి చెందిన ఓ ప్రాజెక్టు అవార్డు సొంతం చేసుకుంది. స్మార్ట్‌సిటీలుగా ఎంపికైన 100 నగరాల్లో 15 ప్రధాన నగరాల మధ్య కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఛాలెంజ్‌ ప్రాజెక్టుల్లో జీవీఎంసీ పాఠశాలలను ఆధునికీకరించిన విభాగంలో ఫ్రెంచ్‌ ప్రభుత్వాన్ని ఆకర్షించింది. ఈ ప్రాజెక్టుకు ఫిదా అయిన ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి అనుబంధ సంస్థైన ఫ్రెంచ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఎఎఫ్‌డీ) పాఠశాలలు అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. 
  ఎంత నిధులు..? 
  మొత్తం రూ.65 కోట్లతో గ్రేటర్‌ పరిధిలోని 40 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రూ.52 కోట్లు ఫ్రెంచ్‌ ప్రభుత్వ సంస్థ ఏఎఫ్‌డీ మంజూరు చేస్తుంది. మిగిలిన రూ.13 కోట్లు జీవీఎంసీ కేటాయిస్తుంది. 
  ఏఏ పాఠశాలలను అభివృద్ధి చేస్తారు.?  
  మొత్తం 40 పాఠశాలలను ఎంపిక చేశారు. భీమిలి జోన్‌లో 6 స్కూల్స్, జోన్‌–3లో 7 పాఠశాలలు, జోన్‌–4లో 7, జోన్‌–5లో 11, అనకాపల్లిలో 9 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో 34 ప్రాథమిక పాఠశాలు కాగా, 6 హైస్కూల్స్‌ ఉన్నాయి. 
  పాఠశాలలను ఎలా ఎంపిక చేశారు.? 
  సిటీస్‌ ప్రాజెక్టుకు అనుగుణంగా స్కూల్స్‌లో స్మార్ట్‌ క్యాంపస్, క్రీడా ప్రాంగణానికి అనువైన స్థలం ఉండటంతో పాటు బాల బాలికల నిష్పత్తి, పాఠశాల అభివృద్ధి చేస్తే బాలికలు చదువుకునేందుకు వచ్చే అవకాశాలు, అభివృద్ధికి ఆస్కారం ఉన్న పాఠశాలలను ఎంపిక చేశారు. 
  ఎలా అభివృద్ధి చేస్తారు..? 
  విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తారు. సామాజిక వసతులతో పాటు అభ్యసనకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఆటస్థలం, పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించడం, డిజిటల్‌ తరగతి గదులు, విద్యార్థులు ఆరోగ్య వ్యవహారాలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా రికార్డులు నిర్వహణ ఇలా అనేక అంశాల్లో పాఠశాలను అభివృద్ధి చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది.

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ap-government-schools-development-under-french-devlopment-agency-1376833