సర్దుబాటు చార్జీలు శాశ్వతం కాదు

  • 2022 మార్చి వరకు మాత్రమే ప్రస్తుత ట్రూఅప్‌: ఇంధన శాఖ కార్యదర్శి 
  • త్రైమాసిక చార్జీలు ఒకదానితో మరొకటి కలవవు
  • 2019–20 సర్దుబాటు ప్రతిపాదనకు ఇంధన చార్జీల పెరుగుదలే కారణం 

సర్దుబాటు చార్జీలు శాశ్వత ప్రాతిపదికగా విద్యుత్‌ బిల్లులలో విధించరని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. ట్రూ అప్‌ చార్జీలనేవి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిర్ధేశించిన కాలానికి మాత్రమే బిల్లులలో ప్రత్యేకంగా వేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత నిర్దేశిత సర్దుబాటు చార్జీలు ఏపీఈఆర్‌సీ ఉత్తర్వుల ప్రకారం 2022 మార్చి నెల వరకు మాత్రమే వసూలు చేస్తారని, ఈ ఎనిమిది నెలల తర్వాత ఉండవని శ్రీకాంత్‌ వెల్లడించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..

► ఇంధన – విద్యుత్‌ సేకరణ వ్యయ సర్దుబాటు చార్జీ (త్రైమాసిక సర్దుబాటు చార్జీ) ప్రతి త్రైమాసికానికి వేర్వేరుగా మదింపు చేస్తారు. క్రిందటి త్రైమాసికంలో వేసిన చార్జీ మరుసటి త్రైమాసికానికి కలపరు.

► త్రైమాసికం–1లో అదనపు ఖర్చు రూ.100 కోట్లు అయ్యి, విద్యుత్‌ వినియోగం 12,000 మిలియన్‌ యూనిట్లు ఉంటే, సర్దుబాటు చార్జీ యూనిట్‌కు 8 పైసలు అవుతుంది. తర్వాతి త్రైమాసికంలో అదనపు వ్యయం రూ.200 కోట్లు ఉంటే అదే వినియోగానికి సర్దుబాటు చార్జీ యూనిట్‌కు 16 పైసలు అవుతుంది. ఈ లెక్కన మొదటి త్రైమాసికం చార్జీ 8 పైసలు కలుపుకుని 24 పైసలు అవ్వదు.  

► విద్యుత్‌ సంస్థలకు మూడు నెలలకొకసారి సర్దుబాటు చేసే వెసులుబాటు 2012 వరకు (త్రైమాసిక ఇంధన సర్‌ చార్జీ నియమావళి) అమలులో ఉండేది. ఆ తర్వాత వార్షిక విద్యుత్‌ కొనుగోలు వ్యయం సర్దుబాటు నియమావళి అందుబాటులోకి వచ్చింది. 

► విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్‌ సరఫరా కోసం చేసిన వాస్తవ అదనపు ఖర్చులకు రూ.2,500 కోట్లు సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా గతేడాది డిసెంబర్‌లోనే ప్రతిపాదనలను సమర్పించారు. ఆ సంవత్సరాలకు ఇప్పుడు కొత్తగా ఎలాంటి ప్రతిపాదన పంపలేదు.

► 2019–20లో సర్దుబాటు ప్రతిపాదనలకు 2019 ఫిబ్రవరిలో, విద్యుత్‌ కేంద్రాల వారీగా అంచనా వేసిన ఇంధన (బొగ్గు, గ్యాస్‌) చార్జీలు పెరిగిపోవటమే ప్రాథమిక కారణం. ఈ వ్యయం పెరుగుదల 2019–20 ఆర్థిక సంవత్సరానికి ఏపీ జెన్‌కో థర్మల్‌ కేంద్రాలకు దాదాపు రూ.0.77/యూనిట్, కృష్ణపట్నంకు రూ 0.46/యూనిట్, కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ కేంద్రాలకు రూ.0.84/యూనిట్, స్వతంత్ర విద్యుత్‌ కేంద్రాలకు రూ .0.69/యూనిట్‌, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలకు రూ. 0.56/యూనిట్‌ గా ఉంది.   

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/nagulapalli-srikanth-comments-adjustable-power-charges-1395736