సిరులను పండిస్తున్న రత్నమ్మ

ప్రజలకు కావాల్సిన మంచి పంటలను పండించటమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తున్న మహిళ రైతు రత్నమ్మ అనంతపురం జిల్లా, ఆత్మకూరు మండలం, తలపూరు గ్రామానికి చెందిన వారు. 15 ఏళ్ళ క్రితం తన భర్త ఇళ్ళు విడిచి.. తనను ఒంటరిని చేసినప్పటికి మనోధైర్యంతో తన ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. అదే క్రమంలో వ్యవసాయం చేస్తూ తన మూడెకరాల మెట్ట, నీటి వసతి ఉన్న రెండెకరాల భూమిలో కొర్రలు, సామలు, కందులు, అరికెలు, ఊదలు, వేరుశనగ వంటి పంటలను ఆమె సాగు చేస్తున్నారు. అంతేకాదు ఆమె మహిళా రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తిదారుల సంఘానికి అధ్యక్షురాలు. 4 పంచాయతీల్లోని 270 మంది మహిళా రైతులు ఆ ఎఫ్‌.పి.ఓ.లో సభ్యులుగా వున్నారు. వీరందరికి విత్తనాలు ఇస్తూ.. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించేలా అందరిని ప్రోత్సాహిస్తుంది. పండిన పంటలను శుద్ధి చేయించి విక్రయిస్తూ సంఘంలోని మహిళ సభ్యులకు మరింత లాభాలు పంచుతూ విజయపధంలో ముందుకు సాగుతోంది.

అతి తక్కువ ఖర్చుతో చిరుధాన్యాల ప్రాసెసింగ్

చిరుధాన్యాలను నేరుగా అమ్ముకుంటే ఏం లాభం లేదని.. వాటి పొట్టు తీసి ప్రాసెసింగ్ చేసి బియ్యం తయారు చేస్తుంది. అదే క్రమంలో తక్కువ ఖర్చుతో కొర్రలు, సామలను డా.ఖాదర్‌ వలి సూచించిన ‘బుచ్చి పద్ధతి’లో మిక్సీలతో ఇంటిపట్టునే ఆయా ఉత్పత్తులను సిధ్దం చేసుకుంటుంది. ఇలా ప్రాసెసింగ్ చేసి.. ఇతర ప్రాంతాల వారికి అమ్ముకోవటం వల్ల ఎఫ్‌.పి.ఓ. సభ్యులు కూడ మంచి ఆదాయం పొందుతున్నారు.

తమ గ్రామాల్లో 79 మంది షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న వారిని ఎంపిక చేసుకొని వారికి నెలనెలా ప్రత్యేకంగా తయారు చేసిన సిరిధాన్యాల కిట్‌ను అందిస్తూ రత్నమ్మ అందరి అభినందనలు అందుకుంటున్నారు.