ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యాచరణ రూపొందించింది. వ్యాక్సినేషన్ ను సకాలంలో పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కోవిడ్–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు 75,49,960 కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు వచ్చాయని.., వాటిలో కోవీషీల్డ్ 62,60,400 కాగా, కొవాక్సిన్ 12,89,560 డోస్‌లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి సెకండ్ డోస్ వారికే ప్రాధాన్యమిస్తున్నామన్నారు. సెకండ్ డోస్ పూర్తైన తర్వాత తొలిడోస్ తీసుకునేవారికి వేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిల్చినట్లు అధికారులు వెల్లడించారు. వ్యాక్సీన్లు సరఫరా చేసే కంపెనీలు మూడు వారాల్లో తమ బిడ్లు దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ఇక భవిష్యత్తులో కూడా మెడికల్ ఆక్సిజన్ కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు మెడికల్ ఆక్సిజన్ వినియోగం 600 టన్నులు దాటిన దృష్ట్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమన్నారు. రాష్ట్రంలో ప్రతిపాదిత కృష్ణపట్నం స్టీల్ ప్లాంట్‌తో పాటు, కడపలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్‌కు ఉపయోగపడేలా, అదే సమయంలో రాష్ట్రంలో రోగుల అవసరాలను తీర్చేలా ఒక ఆక్సిజన్ ప్లాంట్‌ను నిర్మించే ఆలోచన చేయాలన్నారు సీఎం. కృష్ణపట్నం లేదా కడపలో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ యుద్ధప్రాతిపదికన తీసుకొచ్చే విషయమై దృష్టి పెట్టాలన్నారు.
రాష్ట్రంలో ఏప్రిల్ 20 నాటికి 360 మెట్రిక్ టన్నులు కేటాయింపులు ఉంటే ప్రస్తుతం వినియోగం సుమారు 600మెట్రిక్ టన్నులకుపైగా చేరిందని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రస్తుతానికి కేటాయింపులు 590 టన్నులు వరకూ ఉన్నాయన్నారు. వివిధ జిల్లాలకు 8 క్రయోజనిక్ స్టోరేజ్ ట్యాంకులు పంపిణీ చేసినట్లు అదికారులు వివరించారు. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసే వాహనాల సంఖ్యను 56 నుంచి 78కు పెంచామన్న అధికారులు.., ట్యాంకరు రాగానే దాని నుంచి రీఫిల్ చేసి పంపిణీ చేయడానికి మరో 14 వాహనాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒడిశాలోని వివిధ కర్మాగారాల నుంచి రోజుకు 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తీసుకు రావడానికి 36 వాహనాలను వినియోగిస్తున్నామన్నారు.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లకు అనుగుణంగా సరైన ప్రెజర్‌తో ఆక్సిజన్ వెళ్లేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నేవీ, ఇతర సాంకేతిక సిబ్బంది సహాయం తీసుకుని ప్రెజర్ తగ్గకుండా అందరికీ సమరీతిలో ఆక్సిజన్ వెళ్లేలా చూడాలని సూచించారు. దీని కోసం అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలన్నారు.
రాష్ట్రంలో 15 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, 10 వేల డి-టైప్ సిలెండర్లను త్వరలోనే ఆస్పత్రులకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే అదనంగా 250 వెంటిలేటర్ల ఏర్పాటు, వాటిలో ఇప్పటికే 50 సరఫరా చేశామని అధికారులు వివరించారు. కొత్తగా 6500 మెడికల్ గ్యాస్ పైపులైన్లు.., 53 చోట్ల పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆస్పత్రులకు వచ్చే రోగులు ఇబ్బందులు పడకుండా వాటి ఆవరణల్లో జర్మన్ హేంగర్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. అందుబాటులో ఉన్న ఏరియాను బట్టి కనీసం 25 నుంచి 50 బెడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్స కోసం 669 ఆస్పత్రులను గుర్తించగా, వాటిలో మొత్తం 47,693 బెడ్లు ఉండగా, వాటిలో 39,749 బెడ్లు ఆక్యుపైడ్ అని, వాటిలో సగానికి పైగా, అంటే 26,030 బెడ్లు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇక అన్ని ఆస్పత్రులలో ఐసీయూ బెడ్లు 6513, నాన్ ఐసీయూ ఆక్సిజన్ బెడ్లు 23,357, నాన్ ఐసీయూ నాన్ ఆక్సీజన్ బెడ్లు 17,823 ఉన్నాయన్న అధికారులు మొత్తం 3460 వెంటిలేటర్లు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
Source: https://telugu.news18.com/news/coronavirus-latest-news/andhra-pradesh-cm-ys-jagan-reviews-on-corona-vaccination-treatment-and-health-facilities-in-the-state-decided-to-go-for-global-tenders-to-buy-oxygen-full-details-here-prn-872772.html