సీఎం ఢిల్లీ పర్యటనతో పోలవరం పనుల్లో వేగం

  • పోలవరం ఏరియల్‌ వ్యూ
  • సీఎం జగన్‌ పర్యటనతో కేంద్రంలో కదలిక.. ప్రాజెక్టు స్థితిగతులపై రేపు ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం
  • కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి షెకావత్‌ ఆదేశాలతో ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ ఏర్పాట్లు
  • 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌.. 
  • నీటి పారుదల, నీటి సరఫరా విభాగాలు రెండూ ఒకటే..
  • పీపీఏ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలి
  • నిధులను రీయింబర్స్‌ చేయడంలో జాప్యం లేకుండా చూడాలి
  • వీటన్నింటితో పాటు ఇతర సాగు నీటి ప్రాజెక్టుల సమస్యలపై చర్చించే అవకాశం

  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనతో కేంద్రంలో కదలిక వచ్చింది. తమ భేటీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రస్తావించిన అంశాలను పరిష్కరించాలంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆదేశించారు. ఆ అంశాలపై చర్చించి, పరిష్కరించేందుకు ఢిల్లీలో సోమవారం కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలో జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులతో కూడిన అధికారుల బృందం ఆదివారం ఢిల్లీకి వెళ్తోంది.

  పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడం, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు, వైద్య కళాశాలలకు అనుమతులు తదితర అంశాలపై గురు, శుక్రవారాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవ్‌దేకర్‌.. రైల్వే, పరిశ్రమలు, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌.. ఉక్కు, పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించారు. సీఎం ప్రస్తావించిన అంశాల పరిష్కారంపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే పోలవరంతోపాటు ఇతర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృత అంశాలను కూడా పరిష్కరించాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ను ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆదేశించారు.

  సత్వరమే పోలవరం పూర్తి దిశగా..
  ► రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసే దిశగా సీఎం జగన్‌ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి షెకావత్‌తో చర్చించారు. 
  ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపిందనే అంశాన్ని గుర్తు చేశారు. ఆ వ్యయానికి సంబంధించి పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌) జారీ చేసి, నిధులు విడుదల చేస్తే సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు. 
  ► ఇరిగేషన్‌ (నీటి పారుదల) విభాగం.. నీటి సరఫరా (వాటర్‌ సప్లయ్‌) విభాగం వేర్వేరు కాదని, ఆ రెండు ఒకటేనని సీడబ్ల్యూసీ స్పష్టం చేసిందనే అంశాన్ని ప్రస్తావించిన సీఎం.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని విన్నవించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యయం చేసిన నిధులను రీయింబర్స్‌ చేయడంలో జాప్యం లేకుండా చూడాలని.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని ప్రతిపాదించారు.
  ► వీటన్నింటికీ కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై చర్చించి, పరిష్కరించేందుకు సోమవారం కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్‌ హెచ్‌కే హల్దార్‌ తదితర ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎస్‌ నేతృత్వంలో అధికారుల బృందాన్ని పుంపుతామని కేంద్ర మంత్రికి సీఎం చెప్పారు.  

  అపరిష్కృత అంశాల పరిష్కారమే అజెండా 
  ► కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి షెకావత్‌ ఆదేశాల మేరకు పోలవరంతోపాటు రాష్ట్రానికి చెందిన నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృత అంశాల పరిష్కారమే అజెండాగా సోమవారం ఢిల్లీలో ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. 
  ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లగా సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసిన సీడబ్ల్యూసీ, టీఏసీ.. ఆ మేరకు నిధులు ఇస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేసిన అంశాన్ని సమావేశంలో ప్రస్తావించాలని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. 
  ► ఆ వ్యయానికి సంబంధించి తక్షణమే ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చి.. కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేయనున్నారు. హెడ్‌ వర్క్స్‌(జలాశయం), కుడి కాలువ, ఎడమ కాలువ, భూ సేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ వంటి విభాగాలతో నిమిత్తం లేకుండా ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. 
  ► జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం నీటి పారుదల, నీటి సరఫరా వ్యయం వేర్వేరు కాదని రెండు ఒకటేనని.. ఇదే అంశంపై సీడబ్ల్యూసీ చైర్మన్‌ హెచ్‌కే హల్దార్‌ ఇచ్చిన నివేదికను సమావేశంలో ప్రస్తావించి, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. 
  ► రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు ఖర్చు చేసిన నిధుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోందని, దీన్ని నివారించాలని సూచించనున్నారు. ప్రాజెక్టు పనులకు సమీపంలోనే పీపీఏ కార్యాలయం ఉంటే.. ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని, తక్షణమే ఈ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని కోరనున్నారు. 
  ► ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న డిజైన్‌లను యుద్ధ ప్రాతిపదికన ఆమోదించాలని సూచించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలతోపాటు రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూడా సమావేశంలో చర్చిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.  

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-jagan-delhi-tour-helps-polavaram-project-works-speedup-1370758