సీఎం వైఎస్ జగన్ చొరవతో ఓ చిన్నారి ప్రాణం నిలిచింది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన ముక్కన్న, సునీతమ్మ దంపతుల బాబు అమిత్ (4) 2020 నవంబర్ 24న వేరుశనగ విత్తనం మింగాడు. ఆ తర్వాత నుంచి ఊపిరాడక ఇబ్బందిపడుతున్న కుమారుడిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. స్కానింగ్ చేయించగా ఊపిరితిత్తుల్లోకి వేరుశనగ విత్తనం వెళ్లిందని తేలింది. వేరుశెనగ విత్తనం తీసేందుకు శస్త్రచికిత్స అవసరమనీ. అందుకు రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఆర్థిక స్థోమత లేని చిన్నారి తల్లిదండ్రులు వైఎస్సార్సీపీ స్థానిక నేత అభ్యర్థి ప్రభావతమ్మ, ఇతర మండల నాయకులను ఆశ్రయించారు. వారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయానికి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే దీన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. వెంటనే సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే అవసరమైన చికిత్స అందించాలని కర్నూలు శ్రీసత్యసాయి ఈఎస్టీ ఆస్పత్రి వైద్యులకు సూచించారు. ఈ ఆదేశాలతో వైద్యులు డిసెంబర్ 4న శస్త్రచికిత్స చేసి చిన్నారి ప్రాణాలు కాపాడారు. తమ కష్టం విని వెంటనే స్పందించిన సీఎంకు. ఎమ్మెల్యేకు చిన్నారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Source: