సొంతింటి కల సాకారం 

బాపట్ల ప్యాడిసన్‌పేటలో 50 ఎకరాల కుపైగా విస్తీర్ణంలో 1,865 ప్లాట్లతో ఏర్పాటైన వైఎస్సార్‌ జగనన్న కాలనీ లేఅవుట్‌ అది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అందమైన ఇంటిని కట్టుకున్న పి.సుకన్య కుటుంబం ఇటీవలే గృహ ప్రవేశం కూడా చేసింది. కత్తిపూడి – ఒంగోలు హైవే పక్కనే ఉండటంతో ఇక్కడ భూముల ధరలు చుక్కల్లో ఉన్నాయి. కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పని చేస్తున్న ఆమె భర్త జీతం పిల్లల చదువులకే చాలక ఇన్నాళ్లూ అద్దె ఇంట్లో ఎంతో ఇబ్బంది పడ్డారు. ఖరీదైన ప్రాంతంలో ప్రభుత్వం ఆమెకు ఉచితంగా ఇంటిని అందచేయడంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు తమ ఇంటికి ఆడుకునేందుకు స్నేహితులు వస్తున్నారని ఆమె కుమారుడు ఆనందంగా చెప్పాడు.

అద్దె ఇళ్లలో ఏళ్ల తరబడి అవస్థలు పడ్డ అక్కచెల్లెమ్మలకు రూ.లక్షల విలువైన స్థిరాస్తి ఉచితంగా సమకూరుతోంది. పేదలకు వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలిచ్చి గృహాలను కూడా నిర్మిస్తుండటంతో అద్దె ఇళ్ల కష్టాలకు శాశ్వతంగా తెరపడుతోంది. విలువైన ప్రాంతాల్లో కలల సౌధాలను ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శరవేగంగా సాకారం చేస్తుండటంతో హర్షం వ్యక్తమవుతోంది. దేశంలోనే తొలిసారిగా 31 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలను అందచేసి గృహ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది.

మొదటి దశలో రూ.28,084 కోట్లతో 15,60,227 ఇళ్ల నిర్మాణం చేపట్టగా వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోపక్క సొంతిల్లు లేని పట్టణ పేదలు సగర్వంగా జీవించేలా అన్ని వసతులతో దాదాపు 2.62 లక్షల టిడ్కో ఇళ్లను ప్రభుత్వం సమకూరుస్తోంది. మూడేళ్లలో రూ.5,646.18 కోట్లతో పనులు చేపట్టడమే కాకుండా ఇటీవల మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఉచితంగా రిజిస్ట్రేషన్లను సైతం చేస్తోంది. గత మూడేళ్లలో 1,13,324 టిడ్కో ఇళ్లు పూర్తికాగా మరో 63 వేలకు పైగా యూనిట్ల పనులు 75శాతం పూర్తయ్యాయి.  

ఖరీదైన ప్రాంతాల్లో కలల సౌధాలు 
జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన బాపట్లలో ప్యాడిసన్‌పేట లే అవుట్‌కు అర కి.మీ దూరంలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ ఏర్పాటు కానుంది. ఎన్‌హెచ్‌ 216 విస్తరణ జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ప్రైవేట్‌ లేఅవుట్లలో సెంటు స్థలం రూ.7 లక్షల వరకూ పలుకుతోంది. బాపట్ల పరిధిలోనే మూలపాలెం వద్ద 1,054 ప్లాట్‌లు, వెస్ట్‌ బాపట్లలో 658 ప్లాట్‌లతో మరో రెండు వైఎస్సార్‌ జగనన్న లేఅవుట్‌లు ఉన్నాయి.

ఇవి జమ్ములపాలెం వద్ద నూతనంగా నిర్మిస్తున్న బాపట్ల మెడికల్‌ కళాశాలకు 2 కి.మీ.లోపే ఉంటాయి. ఇక్కడ సెంటు స్థలం రూ.5 లక్షల పైమాటే. విలువైన ప్రాంతాల్లో స్థలాలను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, పొదుపు సంఘాల ద్వారా పావలా వడ్డీ రుణాలు ఇప్పిస్తోంది.  

డిసెంబర్‌ నాటికి అన్నీ అందించేలా.. 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే 300 చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తున్న 1.43 లక్షలకుపైగా టిడ్కో ఇళ్లను నిరుపేదలకు ఒక్క రూపాయికే అందించి రిజిస్ట్రేషన్‌ సైతం ఉచితంగానే చేసిచ్చారు. 365, 430 చ.అడుగుల ఇళ్లను 50 శాతం సబ్సిడీకే అందిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై మరో రూ.4,250 కోట్లు అదనపు భారం పడుతున్నా వెనుకాడలేదు. డిసెంబర్‌ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. 

30 ఏళ్లు గుడిసెలోనే.. 
పూరిగుడిసెలో 30 ఏళ్లు గడిపాం. ఎండాకాలం అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్రంగా నష్టపోయాం. మా దుస్థితి చూసి బంధువులు కూడా వచ్చేవారు కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఆ కష్టాల నుంచి విముక్తి కల్పించింది. నేడు మాకంటూ ఓ సొంత ఇల్లు ఉంది.   
– క్రిష్ణమ్మ, శెట్టిపల్లె, చిత్తూరు జిల్లా  

రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేసిచ్చారు 
మాకు టిడ్కో ఇల్లు మంజూరైంది. గతంలో రూ.2.55 లక్షలు కట్టమన్నారు. జగన్‌ బాబు వచ్చాక ఆ డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేసిచ్చారు. ఇక్కడ అన్ని వసతులున్నాయి. 
– అట్ల విజయలక్ష్మి, నెల్లూరు

అదే ఇల్లు ఉచితంగా.. 
గత ప్రభుత్వ హయాంలో 300 చ.అ టిడ్కో ఇంటికి రూ.2.65 లక్షలు కట్టమన్నారు. జగనన్న వచ్చాక అదే ఇంటిని రూపాయికే ఇవ్వడంతో పాటు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేశారు. అన్ని వసతులు కల్పించారు.  
– కాకుమాను వరలక్ష్మి, శ్రీకాకుళం 

అర్హులందరికీ ఇళ్లు 
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నిలువ నీడ లేని పేదలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని సమకూర్చటాన్ని సీఎం జగన్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.  
– జోగి రమేశ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/3-years-ys-jagan-government-houses-poor-people-1459852