సోలార్ పవర్ లో ఏపీ సూపర్

  • దేశవ్యాప్తంగా 2021లో పెరిగిన 10 గిగావాట్ల సౌరవిద్యుత్‌ సామర్థ్యం
  • ఇందులో 50 శాతం ఏపీ, రాజస్థాన్, కర్ణాటకల్లోనే 
  • ఏపీలో 4.3 గిగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం  
  • వెల్లడించిన మెర్కామ్‌ ఇండియా తాజా నివేదిక

పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సాధించింది. ఈ రంగంలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలోకి భారత్‌ చేరగా.. మన దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలిచింది. మెర్కామ్‌ ఇండియా తాజా రీసెర్చ్‌ నివేదిక ప్రకారం 2021లో మన దేశం రికార్డు స్థాయిలో 10 గిగావాట్ల సౌరవిద్యుత్‌ సామర్థ్యాన్ని స్థాపించింది. దీన్లో 50 శాతం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నెలకొల్పినట్లు అధ్యయనంలో వెల్లడైంది.

2020లో దేశంలో సౌరవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం పెరుగుదల 3.2 గిగావాట్లు మాత్రమే ఉంది. అంటే 2020తో పోలిస్తే 2021లో పెరుగుదల 210 శాతంగా నమోదైంది. దీంతో డిసెంబర్‌ 2021 చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం సామర్థ్యం 49 గిగావాట్లకు చేరుకుంది. సోలార్‌ రూఫ్‌టాప్‌ ఇన్‌స్టలేషన్‌లు 2021లో 138 శాతం పెరిగాయి. ఇవి రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పునరుత్పాదక రంగంలో మొదటి మూడు రాష్ట్రాలుగా ఇవి నిలిచాయి. కోవిడ్‌–19 కారణంగా 2020లో నెలకొల్పాల్సిన ప్రాజెక్టులు 2021లో స్థాపించడంతో ఇది సాధ్యమైంది. 

ఎదురవుతున్న సవాళ్లు 
మనదేశం పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంలో ప్రపంచంలో నాలుగో స్థానంలో, సౌరశక్తిలో ఐదో స్థానంలో, పవన విద్యుత్‌లో నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో మనదేశం ఈ ఏడాది 175 గిగావాట్ల ఇన్‌స్టలేషన్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనుకుంటోంది. అయితే కస్టమ్స్‌ సుంకం, దిగుమతుల్లో ఎదురవుతున్న పరిమితులు, గ్లోబల్‌ సప్లయ్‌ చైన్‌ సమస్యలు, అధిక జీఎస్టీ.. తదితర అంశాల్లో పునరుత్పాదక విద్యుత్‌ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది.   

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/andhra-pradesh-achieved-another-milestone-solar-power-1440003