స్కూలు బ్యాగ్‌ పాలసీ–2020

పాఠశాల విద్యార్థుల స్కూలు బ్యాగులు  మోసే భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త విధాన నిర్ణయాలను ప్రకటించింది.  ‘స్కూలు బ్యాగ్‌ పాలసీ–2020’ని  అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని పేర్కొంది. ఈ పాలసీ ప్రకారం విద్యార్థి కేంద్రంగా బోధనాభ్యసన ప్రక్రియలు సాగే పద్ధతి ద్వారా పిల్లల్లో ఒత్తిడి, స్కూలు బ్యాగ్‌ బరువు తగ్గుతాయి. అనేక సర్వేల్లో స్కూళ్లలో విద్యార్థి కేంద్ర అభ్యసనం కన్నా పుస్తకాలు, టీచర్ల బోధన కేంద్రంగా మారిపోతుండడమే బ్యాగ్‌ బరువు పెరగటానికి కారణంగా తెలుస్తుంది.

స్కూలు బ్యాగ్‌  బరువు కారణంగా పిల్లలు వెన్నెముక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు కారణంగా శారీరక సమస్యలు రావడంతో వారి చదువులపై ప్రభావం చూపుతోంది. దీంతో కేంద్రం స్కూల్‌ బ్యాగ్‌ పాలసీని ప్రకటించి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించింది.

మన దేశంలో పరిస్థితి ఇలా..
స్కూల్‌ బ్యాగ్‌ బరువుకు సంబంధించి దేశంలోని పరిస్థితిపై కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించి పలు సమస్యలను గుర్తించాయి. 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లల బరువులో పదిశాతానికి సమానంగా 2 నుంచి 3 కిలోల బరువు మాత్రమే ఉండాల్సి ఉన్నా వారి బ్యాగ్‌లు 5 కిలోలకు మించిన బరువుతో ఉంటున్నాయి. 6వ తరగతి విద్యార్థులకు 6 కిలోల బరువు వరకు ఇబ్బంది లేదు. కానీ వీరి బ్యాగ్‌లలోని వస్తువుల బరువు ఇలా ఉంటోంది.
పాఠ్యపుస్తకాలు – 1 నుంచి 3.5 కిలోలు
నోట్సులు – 1 నుంచి 2.5 కిలోలు
లంచ్‌బాక్స్‌ – 250 గ్రా. నుంచి 1 కిలో
వాటర్‌ బాటిల్‌ – 200 గ్రా. నుంచి 1 కిలో
బ్యాగు బరువు – 150 గ్రా. నుంచి 1 కిలో

ఇక పైతరగతులకు వెళ్లేకొద్దీ ఈ బ్యాగ్‌ బరువు ఇంకా పెరుగుతోంది. దీంతో విద్యార్థులు అలసటకు గురవడమే కాకుండా శారీరక సమస్యలతో చదువులపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మంచినీటి సదుపాయం, మధ్యాహ్న భోజనం అమలయ్యే స్కూళ్లకు వెళ్లేవారికి ఆ రెండింటి బరువు తగ్గుతున్నా చాలా ప్రయివేటు పాఠశాలల్లో ఆ సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని స్కూళ్లు పిల్లలతో బడిలోనే హోంవర్కు చేయిస్తూ నోట్సులు, వర్కు పుస్తకాలను స్కూల్లోనే ఉంచుతున్నాయి. ఇంటి దగ్గర హోంవర్కు చేయాల్సి వస్తే ఒకే పుస్తకంలో అన్ని సబ్జెక్టులవి చేయిస్తున్నాయి. కొన్ని స్కూళ్లు రోజు విడిచి రోజు స్కూలు బ్యాగ్‌ తెచ్చేలా ఏర్పాట్లు చేశాయి. సెకండరీ, హయ్యర్‌ సెకండరీ తరగతులకు వచ్చేసరికి వివిధ సబ్జెక్టులతో పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కు పుస్తకాలు పెరిగిపోతున్నాయి.

కొత్త విధానంలో పలుసూచనలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం స్కూలు బ్యాగ్‌ బరువు తగ్గించేందుకు పలు సూచనలు చేసింది.
– బ్యాగ్‌ను రెండు వైపులా భుజాలపై ఉండేలా రూపొందించాలి.
– స్కూళ్లలో విద్యార్థులకు లాకర్లు, దివ్యాంగుల కోసం బుక్‌బ్యాంక్‌ ఏర్పాటు చేయాలి.
– నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ సూచనల ప్రకారం లైఫ్‌స్కిల్స్, కంప్యూటర్, మోరల్‌ ఎడ్యుకేషన్, జనరల్‌ నాలెడ్జి వంటి పాఠ్యపుస్తకాలు స్కూళ్లలోనే ఉంచేలా ఏర్పాట్లు చేయాలి.
– స్కూలు బ్యాగ్‌ బరువు తగ్గేందుకు వీలుగా తరగతుల టైమ్‌టేబుల్‌ను మార్చుకోవాలి.
– ఒకే సబ్జెక్టు వరుసగా రెండు పీరియడ్లు ఉండేలా చూడడం వంటి విధానలు పాటించాలి.
– పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుపుస్తకాల బరువును అనుసరించి నిర్ణీత పరిమితి మేరకు మాత్రమే బ్యాగ్‌ బరువు ఉండేలా టైమ్‌టేబుల్‌ రూపొందించాలి.
– 1, 2 తరగతులకు ఒకే నోట్‌ పుస్తకం అమలుచేయాలి.
– 3, 4, 5 తరగతులకు రెండు నోట్‌ పుస్తకాలు పెట్టాలి. ఒకదాన్ని బ్యాగ్‌లో ఉంచి, రెండోది స్కూల్లోనే ఉండేలా చూడాలి.
– 6, 7, 8 తరగతుల వారికి లూజ్‌ పేపర్లలో క్లాస్‌వర్క్‌ చేసేలా ఫైల్‌ను ఏర్పాటుచేయాలి. 6వ తరగతి నుంచే ఈ వర్కు పేపర్లను ఒక పద్ధతిలో రాసేలా చేయాలి.
– పాఠ్యపుస్తకాలకు మించి ఇతర పుస్తకాలను స్కూలులో అనుమతించరాదు.
– స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అమలు, మంచినీటి సదుపాయం ఏర్పాటు ద్వారా విద్యార్థులు వాటిని ఇళ్లనుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఆ బరువు తగ్గుతుంది.