స్కూళ్ల పరిసరాల్లో పొగాకు అమ్మకాలపై నిషేధం

  • చిన్నారులు ‘పొగబారి’ పోకుండా ఏపీ సర్కార్‌ చర్యలు
  • దేశంలో అత్యధికంగా 57.9 శాతం మంది మిజోరంలో స్కూలు చిన్నారులు పొగతాగుతున్నట్టు వెల్లడి
  • మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువగా ప్రభావం

అభంశుభం ఎరుగని వయసులో చిన్నారులు ‘పొగ’బారిన పడి జీవితాలు పెడదారి పట్టకుండా ఏపీ సర్కార్‌ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చిన్నారుల మేనమామగా మారి విద్యాభ్యాసం కోసం జగనన్న అమ్మఒడి, నాడు–నేడు కింద పాఠశాలల్లో సకల వసతుల కల్పన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, ఫీజురీయింబర్స్‌మెంట్‌.. ఇలా వారి కోసం చేయగలిగినంతా చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఆ దిశగానే చిన్నారులకు మరింత మేలు చేకూరేలా ఆలోచన చేసి పాఠశాలల పరిసరాల్లో పొగాకు, సంబంధిత ఉత్పత్తుల విక్రయాలు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఓ సర్వేలో స్కూలుకెళ్లే చిన్నారుల్లో ఏ రాష్ట్రంలో ఎంత శాతం మంది పిల్లలు పొగ తాగుతున్నారనే విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో ఏపీ స్థానం ఎక్కడుందో వివరాలు ఈ కథనంలో చదవండి.

జాతీయస్థాయిలో పొగాకు, సిగరెట్, బీడీలు వంటివి స్కూలుకు వెళ్లే చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా 13–15 ఏళ్లలోపు చిన్నారులపై ఇవి అత్యంత ప్రభావితం చూపడమే కాకుండా యుక్తవయసులోనే క్యాన్సర్‌ జబ్బులకు గురి చేస్తున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.. ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాప్యులేషన్‌ స్టడీస్‌ సంస్థతో గ్లోబల్‌ యూత్‌ టొబాకో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో స్కూలుకెళ్లే చిన్నారుల్లో అత్యధికంగా మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో 57.9 శాతం మంది పొగ తాగుతున్నట్టు తేలింది.

తక్కువ మంది చిన్నారులు పొగతాగకుండా ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో నిలిచింది. మన రాష్ట్రంలో 2.6 శాతం మంది స్కూలుకెళ్లే 13–15 ఏళ్లలోపు పిల్లలు రకరకాల పొగాకు వాడుతున్నట్టు తేలింది. ఇప్పటికే దీనిపై అవగాహన కల్పించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. స్కూళ్లకు 100 అడుగుల దూరంలో ఎలాంటి పొగాకు దుకాణం ఉండకూడదని, 18 ఏళ్ల లోపు వారికి అమ్మడం, కొనడం చేయకూడదని ఆదేశించారు. ప్రతి ఏఎన్‌ఎంకు కొన్ని స్కూళ్లు, కాలేజీలు అప్పజెప్పి ప్రతిరోజూ పర్యవేక్షణ చేస్తున్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. స్కూళ్ల దగ్గర గుట్కాలు, పొగాకు, సిగరెట్‌లు బీడీలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/survey-smoking-among-youth-away-smoke-ap-1406433