స్మార్ట్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటు

  • మానవ వనరుల అవసరం లేకుండా నిర్వహణ
  • విద్యుత్‌ డిమాండ్, సరఫరా, ఇబ్బందులు వెంటనే గుర్తించే వీలు
  • అంతా ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహణ
  • ప్రయోగాత్మకంగా విశాఖపట్నం జిల్లా గిడిజాల సబ్‌స్టేషన్‌లో అమలు 
  • ఇప్పటికే టెండర్లు పిలిచిన ఈపీడీసీఎల్‌

► అదో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌. అక్కడ ఉద్యోగులెవరూ లేరు. అక్కడి నుంచి ఆ ప్రాంతంలోని గృహాలకు, దుకాణాలకు విద్యుత్‌ సరఫరా అవుతోంది. 
► ఆ సబ్‌స్టేషన్‌ పరిధిలోని ఒక వీధిలో ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది. సమాచారం ఇద్దామంటే సబ్‌స్టేషన్‌లో ఎవరూ లేరు. అయినా సంబంధిత విద్యుత్‌ సిబ్బంది వెంటనే అక్కడకు వచ్చి మరమ్మతులు ప్రారంభించారు. 
 … ఇందుకు కారణం సదరు సబ్‌స్టేషన్‌ నుంచి ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడమే. ఉద్యోగులు, సిబ్బంది లేకుండా సమాచారం ఎలా వెళ్లిందనేగా మీ అనుమానం? ఆ సబ్‌స్టేషన్‌.. స్మార్ట్‌ సబ్‌స్టేషన్‌. ఉద్యోగులు, సిబ్బంది అవసరం లేకుండానే విద్యుత్‌ సరఫరాలో సమస్య, అధిక లోడు, తక్కువ లోడు ఇలా ఏ సమాచారమైన వెంటనే తెలియజేసేలా సబ్‌స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) పరిధిలో పైలట్‌ ప్రాజెక్టు కింద విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల సబ్‌స్టేషన్‌ను పూర్తి స్థాయి ఆటోమేషన్‌ సబ్‌స్టేషన్‌ (స్మార్ట్‌ సబ్‌స్టేషన్‌)గా తీర్చిదిద్దనుంది.   

అంతా కంట్రోల్‌ రూమ్‌ నుంచే..
వాస్తవానికి ఇప్పటికే గిడిజాల వద్ద 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ ఉంది. ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్‌ స్మార్ట్‌ సబ్‌స్టేషన్‌గా మారనుంది. ఈపీడీసీఎల్‌ పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లను స్మార్ట్‌ సబ్‌స్టేషన్లుగా మార్చేందుకు సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం రూ.334.51 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా ఆహ్వానించింది. గిడిజాల సబ్‌స్టేషన్‌ను స్మార్ట్‌ సబ్‌స్టేషన్‌గా మార్చేందుకు రూ.50 లక్షల మేర వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ సబ్‌స్టేషన్‌లో ఇక ఉద్యోగులెవరూ ఉండరు. పెదవాల్తేరు సబ్‌స్టేషన్‌లోని స్కాడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచే నడవనుంది. గిడిజాల సబ్‌స్టేషన్‌ పరిధిలోని విద్యుత్‌ పంపిణీ, ఇబ్బందులు ఇలా సమాచారమంతా ఆన్‌లైన్‌ ద్వారానే స్కాడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. తదనుగుణంగా ఇక్కడి నుంచే కార్యకలాపాలను నియంత్రించే వీలు కలగనుంది.  

మరింత నాణ్యమైన సేవలు..
ఈపీడీసీఎల్‌ పరిధిలోని సబ్‌స్టేషన్లను ఆటోమేషన్‌ కిందకు మార్చాలని భావిస్తున్నాం. ప్రయోగాత్మకంగా గిడిజాల సబ్‌స్టేషన్‌లో అమలు చేయనున్నాం. ఇందులో వచ్చే ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. స్మార్ట్‌ సబ్‌స్టేషన్‌లో ఎక్కడా ఉద్యోగుల అవసరం ఉండదు. అంతా రిమోట్‌ ద్వారానే నిర్వహించే వీలు కలుగుతుంది. వినియోగదారులకు కూడా మరింత నాణ్యమైన సేవలు అందుతాయి.  
 – కె.సంతోషరావు, సీఎండీ, ఈపీడీసీఎల్‌ 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/smart-substations-gidijala-substation-visakhapatnam-district-1413555