స్వచ్ఛ పాఠశాలల ఎంపిక

  • జిల్లా స్థాయికి 38 పాఠశాలల ఎంపిక
  • వాటిల్లో 8 పాఠశాలలు ఓవరాల్‌ పర్ఫార్మెన్స్‌
  • మరో 6 సబ్‌ కేటగిరీ విభాగంలోపారిశుధ్యం, కోవిడ్‌ మార్గదర్శకాల ఆధారంగా రేటింగ్‌

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో స్వచ్ఛ తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత, కోవిడ్‌ మార్గదర్శకాలు అమలు అంశాల ఆధారంగా కేంద్రం స్కూల్స్‌కు స్వచ్ఛ పురస్కారాలను అందజేయనుంది. పాఠశాల భవనం, పారిశుద్ధ్యం, చేతుల పరిశుభ్రతపై అవగాహన, పచ్చదనం, మరుగుదొడ్ల నిర్వహణ, కోవిడ్‌ మార్గదర్శకాలు అమలు తదితర వాటిని పరిగణలోకి తీసుకున్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 4,440 పాఠశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి 38 పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఎంపికయ్యాయి. పాఠశాల యాజమాన్యం ఇంటర్నల్‌ వాల్యుయేషన్‌ చేయగా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో సీఆర్పీ, పీటీఐ, ఐఈఆర్టీలతో ఎక్స్‌టర్నల్‌ ఎవాల్యుయేషన్‌ చేయించారు. పాఠశాలల్లో అర్బన్‌ నుంచి ఒకటి, రూరల్‌ ప్రాంతం నుంచి రెండు పాఠశాలను ఎంపిక చేశారు.

ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫొటోల ద్వారా ఎంపిక చేసిన పాఠశాలలను పరిశీలన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి స్టార్‌ రేటింగ్‌ కేటాయించనున్నారు. జిల్లా స్థాయి విద్యాలయ పురస్కారాలకు వెంకటగిరి నుంచి శ్రీచైతన్య పాఠశాల మాత్రమే ఎంపికైంది. మిగిలిన 37 ప్రభుత్వ పాఠశాలలే  కావడం గమనార్హం. వీటిలో 8 ఓవరాల్‌ పర్ఫార్మెన్స్‌కు ఎంపికయాయ్యి. సబ్‌ కేటగిరీలో ఎంపికైన 30 పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు నిర్వహణ, చేతులు శుభ్రత తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. 


  
రాష్ట్రస్థాయిలో 20 పాఠశాలల ఎంపిక 
రాష్ట్ర స్థాయికి 20 పాఠశాలలను ఎంపిక చేయనున్నారు. పట్టణ ప్రాంతాలు ఒక్కొక్కొటి, గ్రామీణ ప్రాంతాల్లో మూడేసి ప్రాథమిక, ఉన్నత పాఠశాల లను పరిశీలన బృందాలు పరిశీలించనున్నారు. ఆ పాఠశాలల్లో పారిశుధ్యం, తాగునీరు, పరిశుభ్రత, కోవిడ్‌ మార్గదర్శకాలు అమలు తదితర అంశాలు ఆధారంగా నివేదిక ఇవ్వనున్నారు. ఆ ప్రకారం 40 పాఠశాలలు, సబ్‌ కేటగిరీ విభాగంలో మరో 6 పాఠశాలలకు పురస్కారాలను ఇవ్వనున్నారు. జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన 40 పాఠశాలలకు ఒక్కో పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ అవార్డుతో పాటు రూ.50 వేల నగదు, సమగ్రశిక్ష పథకం కింద ఒక్కో పాఠశాలకు రూ.60 వేలు అందజేస్తారు. కేటగిరీ విభాగంలో ఎంపికైన పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.20 వేలు ఇవ్వనున్నారు.  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/38-schools-nellore-district-nominates-swachha-vidyalaya-awards-1463495