హంద్రి నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు

శ్రీశైలం జలాశయం నుండి 40 టీఎంసీల వరద నీటిని రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలలో కలపి 6.03 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. మరో 33 లక్షల మందికి తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అవసరమైన నీటిని 369.06 మీటర్ల ఎత్తుకు వివిధ దశల్లో ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీని కోసం 565 కిలోమీటర్ల పొడవు గల ప్రదాన కాలువను తవ్వారు. మొదటి దశ ప్రధాన కాలువలో 9 స్థాయిల్లో , రెండవ దశ ప్రధాన కాలువల్లో 4 స్థాయిల్లో నీటిని ఎత్తిపోయడం ఈ పథకంలోని కీలక అంశం. పథకంలో 13.05 కిలోమీటర్ల పొడవు గల 5 సొరంగాల తవ్వకం ద్వారా 8 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏర్పాటు చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాన్ని అనావృష్టి,కరువు కాటకాల వల్ల ఎడారి ప్రాంతంగా మారనివ్వకుండా కాపాడుకునే సంకల్పంతో హంద్రి నీవా సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టును రూపకల్పన చేయటం జరిగింది. రాయలసీమలోని 4 జిల్లాలలో సాగునీరు మరియు త్రాగునీటి సరఫరా చేయాలని హెచ్.ఎన్.ఎస్.ఎస్. సాగునీటి ప్రాజెక్టును ప్రతిపాదించటం జరిగింది.

హెచ్.ఎన్.ఎస్.ఎస్. ప్రధాన కాలువ కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం, మల్యాల గ్రామ సమీపంలో శ్రీశైలం రిజర్వాయర్ తీర ప్రాంతం నుండి ప్రారంభమవుతుంది. ప్రాజెక్టును రెండు దశలుగా చేపట్టటం జరిగింది. మొదటి దశలో కృష్ణగిరి, పత్తికొండ మరియు జీడిపల్లి రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తూ.. కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలకు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలకు మొత్తం 1,98,000 ఎకరాలకు సాగునీరు అందించబడుతుంది. మొదటిదశ ప్రధాన కాలువ 216.30 కి.మీ. ప్రవహించి జీడిపల్లి రిజర్వాయర్ చేరుకుంటుంది. రెండవదశ ద్వారా 4.05 అక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కుప్పం వరకు కూడా హెచ్.ఎన్.ఎస్.ఎస్. 2వ దశను విస్తరించటం జరుగుతుంది. మొదటి దశలో 9 స్టేజ్ లు 2వ దశలో 4 స్టేజ్ లో ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపు చేసారు.