హరిత క్షేత్ర ఓడరేవులు అభివృద్ధి చేస్తున్నాం: సీఎం జగన్‌

దేశీయ దిగుమతుల్లో 2030 నాటికి కనీసం 10 శాతం దిగుబడులు రాష్ట్రం నుంచి జరగాలనేదే ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సులో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం విశాఖలో మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సును ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను ప్రధాని ఆవిష్కరించారు.

ప్రారంభోత్సవ సమావేశంలో వర్చువల్‌ ద్వారా పాల్గొన్న సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ”మారిటైమ్‌ రంగంలో భారత్‌ విశిష్ట గుర్తింపు సాధిస్తుంది. మారిటైమ్‌ ఇండియా సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుంది. గతేడాది నౌకాశ్రయాల ద్వారా 1.2 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్గో రవాణా జరిగింది. నౌకాశ్రయాలపై ఆధారపడి ఇటీవల రాష్ట్రానికి పలు పరిశ్రమలు వచ్చాయి. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేలా కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం.. భావనపాడు వద్ద హరిత క్షేత్ర ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నాం. గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్స్‌ ద్వారా పోర్టుల నిర్వహణ అత్యంత సులువు కానుంది. నౌకాశ్రయాలు, ఓడరేవులు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నాం.

పెట్టుబడులను విశేషంగా ఆకర్షించేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. ఆక్వా వర్శిటీ ఏర్పాటుతోపాటు, 8 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నాం 100 శాతం ఎఫ్‌డీఐలు, మేక్‌ ఇన్‌ ఇండియా, సాగర్‌మాల, భారత్‌మాల వంటి సంస్కరణల ప్రక్రియలు విశేష పురోగతికి దోహదం చేశాయి. ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకిత భావానికి ఒక నిదర్శనంలా మారిటైమ్‌ ఇండియా విజన్‌-2030 డాక్యుమెంట్‌ నిలుస్తుంది. సముద్ర యానం ద్వారా ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చి అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలన్న స్ఫూర్తిదాయక ఎజెండా ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంది.

రాష్ట్రానికి సువిశాలమైన 974 కి.మీ. తీరప్రాంతం ఉంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ తాజా ర్యాంకింగ్స్‌ ప్రకారం..సులభతర వాణిజ్యంలో రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది. నౌకాశ్రయాల్లో మౌలిక వసతుల కల్పన, వాటిపై ఆధారపడిన పరిశ్రమలకు..నిరంతర ప్రోత్సాహం ద్వారానే ఇది సాధ్యమైంది.విశాఖలో అతిపెద్ద నౌకాశ్రయంతోపాటు 5 చోట్ల నౌకాశ్రయాలు.. మరో 10 గుర్తించిన ఓడరేవులు ఉన్నాయి. 170 టన్నులకు పైగా సరుకుల రవాణా జరుగుతోంది.కార్గో రవాణాలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ” అని తెలిపారు.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-virtual-conference-meeting-maritime-india-2021