104 సేవలు భేష్

  • పల్లెలకు వెళ్లి 20 రకాల వైద్య సేవలు
  • బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలతో పాటు మందులు
  • మంచానికే పరిమితమైన వారి ఇళ్లకు వెళ్లి ఉచిత సేవలు
  • పనితీరును అభినందిస్తున్న ప్రజలు

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో కొత్త ఊపిరి పోసుకున్న 104 మొబైల్‌ మెడికల్‌ క్లీనిక్‌ వ్యవస్థ.. గ్రామగ్రామానికి వెళ్లి లక్షలాది మంది రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలందిస్తోంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన 104 వాహనాలు.. చంద్రబాబు హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. కేవలం 199 వాహనాలు మాత్రమే పనిచేసేవి. వాటిలో కూడా కొన్ని ఎక్కడపడితే అక్కడ మొరాయించేవి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని గతేడాది జూలై1న విజయవాడలో ప్రారంభించారు.

అప్పటి నుంచి గతేడాది డిసెంబర్‌ 19 వరకు 104 వైద్య సిబ్బంది 17,74,172 మంది రోగులకు సేవలందించారు. అలాగే 81,653 నిర్ధారణ పరీక్షలు చేశారు. 1,78,73,832 మందులను రోగులకు ఉచితంగా ఇచ్చారు. మలేరియా, టీబీ, లెప్రసీ నివారణ, మాతా శిశు సంరక్షణతో పాటు, బీపీ, షుగర్‌ తదితర 20 రకాల వైద్య సేవలను 104 ద్వారా అందిస్తున్నారు. ఈసీజీ సహా 9 రకాల నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో కూడిన 74 రకాల మందులను ఉచితంగా ఇస్తున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన రోగుల ఇంటికి వెళ్లి.. వారికి వైద్య సేవలందిస్తున్నారు. తమ వద్దకే వచ్చి అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న 104ల పనితీరుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.