ఎస్జీటీలుగా 2,193 మంది నియామకం

  ఎస్జీటీలుగా 2,193 మంది నియామకం.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

  • మరో హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
  • డీఎస్సీ–2008 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల జీవితాల్లో కొత్త వెలుగులు

  తన పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చారు. డీఎస్సీ–2008 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల కలను సాకారం చేశారు. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. గత ముఖ్యమంత్రులెవ్వరూ పట్టించుకోని ఈ సమస్యను.. సీఎం వైఎస్‌ జగన్‌ పరిష్కరించారు. 2,193 మందిని సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్జీటీలు)గా నియమించారు. సీఎం ఆదేశాల మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ సోమవారం దీనికి సంబంధించిన జీవో 39 జారీ చేశారు. 

  మానవతా దృక్పథంతో..
  డీఎస్సీ–2008లో అర్హత సాధించినప్పటికీ ప్యాట్రన్‌లో మార్పుల వల్ల పలువురు అభ్యర్థులు అప్పట్లో అవకాశాలు కోల్పోయారు. దీంతో గత ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ అభ్యర్థులు కాళ్లరిగేలా తిరిగారు. చివరకు ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించారు. అయినా గత ప్రభుత్వాలు న్యాయం చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపారు. చివరకు అనేక పోరాటాల ద్వారా ఒత్తిడి చేస్తే.. తూతూమంత్రంగా ఓ ఎమ్మెల్సీల కమిటీ వేశారు. వీరికి విద్యా వలంటీర్లుగా కానీ, కాంట్రాక్టు పద్ధతిలో గానీ, అవుట్‌సోర్సింగ్‌లో గానీ ఉద్యోగాలిచ్చి, 60 ఏళ్ల వరకు జాబ్‌ సెక్యూరిటీ ఉండేలా చూడాలని ఆ ఎమ్మెల్సీల కమిటీ సిఫార్సు చేసింది. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత.. ఎమ్మెల్సీ కమిటీ సిఫార్సులను పరిశీలించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు చేశారు.

  ఈ కమిటీ అధ్యయనం చేసి అర్హులైన అభ్యర్థుల్లో మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌పై కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు అంగీకరించే వారిని ఎస్జీటీలుగా నియమించాలని సిఫార్సు చేసింది. మానవతా దృక్పథంతో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యా శాఖ క్వాలిఫైడ్‌ అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. మొత్తం 4,657 మందిలో 2,193 మంది తమ సమ్మతి లేఖలు అందించారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌కు పంపగా.. ఆయన ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

  ప్రయోజనాలు, నిబంధనలివే..
  – వీరి నియామకం కాంట్రాక్టు సిబ్బందికి వర్తించే నిబంధనలు, షరతులతో 60 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉంటుంది.
  – 2008 డీఎస్సీకి సంబంధించిన ఈ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు ఆ తర్వాత వచ్చిన డీఎస్సీలో పేర్కొన్న ఇతర విద్యా, సాంకేతిక అర్హత నిబంధనలను రెండేళ్లలో సాధించాలి.
  – అలాగే రెండేళ్లలో ఎన్‌సీటీఈ ఆమోదించిన ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. 
  – ఇతర కాంట్రాక్టు టీచర్లకు అమలయ్యే ప్రయోజనాలు వీరికి కూడా వర్తిస్తాయి. రెగ్యులర్‌ టీచర్లకు వచ్చే ప్రయోజనాలను క్లెయిమ్‌ చేయడానికి వీల్లేదు. 
  – మానవతా దృక్పథంతో 2008 డీఎస్సీ అభ్యర్థుల వరకు మాత్రమే ఈ నియామక ప్రక్రియ. తదుపరి ఇది ప్రామాణికం కాదు.
  – కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ అభ్యర్థులను నియమించిన ఖాళీల సంఖ్య.. భవిష్యత్‌ ఎస్జీటీ పోస్టులకు ఇచ్చే నియామకాల్లో తగ్గిస్తారు.

  Source:https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ap-dsc-2008-candidates-appointed-sgts-1372817