2008 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు తీపి కబురు

    పదమూడేళ్ల నిరీక్షణకు తెరదించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఎప్పుడా ఎప్పుడా అని అభ్యర్థులు ఎదురు చూపులకు పరిష్కారం చూపించారు. దీంతో వారి సుదీర్ఘ పోరాటం ఫలించింది. పదమూడేళ్ల నిరీక్షణకు నేటితో తెరపడినట్టైంది. 2008 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం చూపిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ ను కలిశారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదని.. తమకు న్యాయం చేయాలని జగన్ ను అభ్యర్థించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కూడా డీఎస్పీ అభ్యర్థులతో పాటు సీఎంను కలిసి సమస్యను వివరించారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన సీఎం.. మినిమం టైం స్కేలు ఇచ్చి కాంట్రాక్టు పద్ధతిలో తీసుకునేందుకు అంగీకరించారు.

    సీఎం నిర్ణయం మేరకు సుమారు 2,193 మంది అభ్యర్థులను త్వరలోనే కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లోకి తీసుకోనున్నారు. సీఎంతో సమావేశం తరువాత ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ… ఎందరు సీఎంలు మారినా 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను పట్టించుకోలేదని, సీఎం జగన్‌… మానవతా దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కోర్టు కేసులతో సంబంధం లేకుండా ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత మేర సాయం చేస్తామని సీఎం చెప్పారని తెలిపారు.

    సీఎం జగన్ వెంటనే స్పందించడంపై విద్యార్థులు ఆనందానికి హద్దేలేకుండా పోతోంది. తమకు జరిగిన నష్టాన్ని సీఎంకు వివరిస్తే వెంటనే స్పందించడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారని.. తమ 13 ఏళ్ల నిరీక్షణకు కాస్త ఉపశమనం లభించింది అంటున్నారు. అలాగే త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయంతో 2193 మందికి సీఎం నిర్ణయం వల్ల లబ్ది చేకూరుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు సచివాలయం ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సీఎం కోరినట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు. వారిని రెగ్యులర్ చేయడానికి అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.