22,344 స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ

సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

  • ఈ నెలాఖరు నాటికి పనులు ప్రారంభించాలి 
  • వాచ్‌మెన్ల నియామకంపై దృష్టి పెట్టాలి 
  • విద్యా శాఖపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌   

రాష్ట్రంలో మనబడి నాడు–నేడు కార్యక్రమం రెండో దశలో భాగంగా 22,344 స్కూళ్లలో తలపెట్టిన మౌలిక సదుపాయాల కల్పన పనులను ఈ నెలాఖరు నాటికి ప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. విద్యా శాఖపై సమీక్షలో భాగంగా గురువారం ఆయన నాడు–నేడు పనుల ప్రగతితో పాటు పలు కార్యక్రమాలకు సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా నాడు–నేడు పనులు వేగవంతం చేయాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పాఠశాలలో టీవీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

నాడు–నేడు కింద ప్రభుత్వ స్కూళ్లలో కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయాలు, విలువైన పరికరాలు ఏర్పాటు చేస్తున్నందున రక్షణ కోసం వాచ్‌మెన్‌ నియామకం గురించి ఆలోచించాలని సూచించారు. సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన స్కూళ్లలోని ఉపాధ్యాయులకు ఉత్తమ శిక్షణ అందించాలని, అప్పుడే మంచి ఫలితాలు పొందగలుగుతామని అభిప్రాయపడ్డారు.

టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (టీఎంఎఫ్‌), స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (ఎస్‌ఎంఎఫ్‌)లతో చేపడుతున్న కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలన్నారు. స్కూళ్లలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు–నేడు పనులు చేపట్టిన తర్వాత వాటి నిర్వహణపై ప్రత్యేక ధ్యాస పెట్టాలని ఆదేశించారు. నిర్వహణ సరిగా లేకపోతే మళ్లీ మునుపటి పరిస్థితి వస్తుందన్నారు.  

స్కూళ్లు ప్రారంభించే నాటికి విద్యా కానుక 
వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికల్లా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులందరికీ  జగనన్న విద్యా కానుక అందించాలని సీఎం ఆదేశించారు. విద్యా కానుక కింద విద్యార్థులకు ఇచ్చే వస్తువులన్నీ ఇప్పటికే సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు. బాలికల కోసం ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్‌ కాలేజీ లేదా హైస్కూల్‌ ప్లస్‌ లేదా కేజీబీవీ స్కూలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

బాలికల కోసం 292 మండలాల్లో ఒక హైస్కూల్‌ కమ్‌ జూనియర్‌ కాలేజీ లేదా హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని అధికారులు నివేదించారు. రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌ పనితీరును వివరించారు. 57,828 మంది ఆ యాప్‌ను వినియోగిస్తున్నారన్నారు. ఫొనెటిక్స్‌ మీద దృష్టి పెట్టాలని, పిల్లలు పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలిగేలా తర్ఫీదు ఇవ్వాలని సీఎం సూచించారు.

పాస్‌ పర్సంటేజి తగ్గడం తప్పు కాదు 
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గడాన్ని తప్పుగా భావించనక్కరలేదని సీఎం అధికారులతో పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని, విద్యార్థులలో ప్రమాణాలు పెరిగేలా ముందుకు వెళ్లాలని చెప్పారు.

పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన వారికి నెల లోజుల్లోనే మళ్లీ పరీక్షలు పెడుతూ.. వాటిని రెగ్యులర్‌గానే పరిగణిస్తున్నందున విద్యార్థులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పదో తరగతిలో పాస్‌ అయిన వారు కూడా ఏవైనా 2 సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్‌ రాసుకోవడానికి అనుమతి ఇస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-comments-review-department-education-1464061