3.15 లక్షల మందికి వైఎస్సార్‌ వాహన మిత్ర!

  వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత ఏడాది కంటే ఈసారి 15 శాతం మేర లబ్ధిదారులు పెరగనున్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 2021–22కిగాను వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారులకు జూన్‌లో ఆర్థిక సహాయం అందించేందుకు రవాణా శాఖ సన్నాహాలు ముమ్మరం చేసింది. 

  పెరగనున్న లబ్ధిదారులు
  వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన 2019–20లో 2,36,334 మంది లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. రెండో ఏడాది అంటే 2020–21లో 2,73,985 మందికి ప్రయోజనం కల్పించారు. ఈసారి 15 శాతం మందికి అదనంగా అంటే దాదాపు 3.15 లక్షల మందికి పథకం కింద లబ్ధి కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2020 మే నుంచి 2021 మే 16 వరకు రాష్ట్రంలో కొత్తగా 17,362 ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. మరోవైపు కొత్తగా వేలాది వాహనాల యాజమాన్య హక్కులు బదిలీ అయ్యాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు పెరగనున్నారు.

  జూన్‌ 15న లబ్ధిదారులకు సాయం
  వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాలు, రవాణా శాఖ ఉప కమిషనర్‌ కార్యాలయాల వద్ద బుధవారం నుంచి ప్రదర్శిస్తారు. ఇప్పటికే అర్హులు, కొత్త వాహనాలు కొనుగోలుదారులు, యాజమాన్య హక్కులు బదిలీ అయినవారి వివరాలు ఈ జాబితాలో ఉంటాయి. వీటిపై అభ్యంతరాలను జూన్‌ 3 వరకు స్వీకరిస్తారు. జూన్‌ 8 నాటికి జిల్లా కలెక్టర్లు లబ్ధిదారుల తుది జాబితాలను ఖరారు చేస్తారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత 8 కార్పొరేషన్ల ఎండీలు జూన్‌ 9, 10వ తేదీల్లో పూర్తి చేస్తారు. జూన్‌ 15న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తారు. 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ysr-vahanamitra-above-3-lakh-people-1366472