వడివడిగా ‘వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌’ నిర్మాణం

    • ఇప్పటికే 641 భవనాల నిర్మాణం పూర్తి
    • సెప్టెంబర్‌ నాటికి మొత్తం భవనాలు అందుబాటులోకి.. 

    గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ (హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు) ఏర్పాటు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సుమారు 7,400 పీహెచ్‌సీ సబ్‌సెంటర్లు ఉండేవి. అవి కూడా 90 శాతం అద్దె భవనాల్లో కునారిల్లుతుండేవి. వాటి సంఖ్యను 10,011కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం 8,585 హెల్త్‌ క్లినిక్స్‌కు సొంత భవనాలను సమకూరుస్తోంది.

    పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో వీటి నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,692 కోట్లు కేటాయించింది. ఇప్పటికే 641 భవనాల నిర్మాణం పూర్తికాగా.. 803 భవనాలు స్లాబ్‌ దశ దాటాయి. మరో 4,031 భవనాలు పిల్లర్స్‌ దశకు రావాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి 848 భవనాలను, జూన్‌ నాటికి మరో 4,531 భవనాలను, సెప్టెంబర్‌ నాటికి 3,206 భవనాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇవి పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. 

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ysr-health-clinics-constructions-works-setting-ap-1347509