మున్సిపల్ స్కూళ్లలో ‘ఇ–లెర్నింగ్‌’

  • పదోతరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు
  • ప్రయోగాత్మకంగా 5 కేంద్రాల్లో ప్రారంభం
  • వచ్చే వారం నుంచి 125 మునిసిపాలిటీల్లోనూ..
  • 32 వేలమంది విద్యార్థులకు ప్రయోజనం

  కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా రాష్ట్రంలో మునిసిపల్‌ పాఠశాలలు ముందడుగు వేస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పదోతరగతి విద్యార్థులను పూర్తిస్థాయిలో పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఇ–లెర్నింగ్‌ బాట పట్టాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసులు చేపట్టడం ఇదే తొలిసారి. ముందుగా 5 మునిసిపాలిటీల్లో పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు బుధవారం ప్రారంభించారు. వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 125 మునిసిపాలిటీల్లోనూ అమలు చేయనున్నారు. తద్వారా 32 వేలమంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.  

  అత్యుత్తమ ఫలితాలే లక్ష్యంగా..
  మరో నెలరోజుల్లో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా పరిస్థితులతో పాఠశాలలకు సెలవులు ఇవ్వాల్సి వచ్చింది. కానీ  మునిసిపల్‌ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులు నష్టపోకుండా ఉండాలని పురపాలకశాఖ భావించింది. అందుకే ఇ–లెర్నింగ్‌ విధానంలో వారిని పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం నెలరోజులపాటు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ ప్రణాళికను రూపొందించింది. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ కోసం అన్ని సబ్జెక్ట్‌ నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు ముందుగా తయారుచేసిన టీఎల్‌ఎం వీడియోలు, పీపీటీలను ఆన్‌లైన్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచి బోధిస్తారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తారు.

  పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రం మోడల్‌లోనే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం విజయవాడ, ఒంగోలు, శ్రీకాళహస్తి, తిరుపతి, నరసాపూర్‌ నగరాలు, పట్టణాల్లో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించారు. సబ్జెక్టులవారీగా నిపుణులు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించి విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. వారికి ప్రేరణనివ్వడం, చేతిరాత పరిశీలించడం, పరీక్షల్లో వివిధ అంశాలపై సకాలంలో సమాధానాలను రాసే విధానాన్ని పర్యవేక్షించారు. తొలిరోజు సమస్యలేమీ ఎదురుకాలేదు. మరో నాలుగు రోజులపాటు వీరికి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని 125 మునిసిపాలిటీల్లోని 32 వేలమంది పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించనున్నారు.

  సందేహాలు నివృత్తి అవుతున్నాయి
  పదోతరగతి పరీక్షలు నెలరోజులు ఉన్నాయి. స్కూల్‌కు వెళ్లలేకపోతున్నామని ఎంతో కంగారుపడ్డాను. ఇప్పుడా ఆందోళన తీరింది. ఆన్‌లైన్‌ క్లాసులు  మాకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. పదోతరగతి పరీక్షలకు సంబంధించిన సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. 
  – మురపాక జ్యోత్స్న, పదోతరగతి విద్యార్థిని, నరసాపురం మునిసిపల్‌ పాఠశాల 

  కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా..
  ఆన్‌లైన్‌ క్లాసులు అంటే కార్పొరేట్‌ పాఠశాలలకే పరిమితం అన్న భావనను తొలగిస్తున్నాం. మునిసిపల్‌ పాఠశాలల పదోతరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాం. 
  – డి.కృష్ణవేణి, స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్‌ స్టడీస్‌), విజయవాడ. 

  ఇప్పుడు ధైర్యంగా ఉంది
  మా పిల్లలు పదోతరగతి పరీక్షల కోసం ఎలా చదువుతారో అనే భయం ఉండేది. కానీ ఆన్‌లైన్‌ క్లాసులు మొదలు పెట్టడంతో మా భయం పోయింది. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలన్న నిర్ణయం ఎంతో ఊరటనిస్తోంది. 
  – ఎస్‌.మాధురి, విద్యార్థిని తల్లి, తిరుపతి 

  అత్యుత్తమ ఫలితాలే ధ్యేయం
  కరోనా పరిస్థితులతో మా విద్యార్థులు నష్టపోకూడదు. అందుకే మునిసిపల్‌ విద్యాశాఖ ఆన్‌లైన్‌ తరగతుల ప్రణాళిక రూపొందించింది. పదోతరగతి పరీక్షలకు మా విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తాం. 
  – మిద్దే శ్రీనివాసరావు, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజిక్స్‌), గుడివాడ.