వైఎస్సార్ జలకళ

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతులకు ఉచితంగా బోరు బావులు వేయించేందుకు వైయస్ఆర్ జలకళ పేరుతో ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది. ఏపీలో మొత్తం 1.62 కోట్ల హెక్టార్ల భూమి ఉంది. అందులో 22.6 శాతం అటవీ ప్రాంతం కాగా, మరో 12.6 శాతం వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇక మిగిలిన భూమిలో నికరంగా వ్యవసాయానికి అందుబాటులో ఉన్న ప్రాంతం 60.48 లక్షల హెక్టార్లు.  సాగుబడిలో ఉన్న భూమిలో కాలువల ద్వారా నీటి లభ్యత ఉన్న ప్రాంతం సుమారు 47 శాతం కాగా 42.5 శాతం భూములకు బోరు బావులు ఆధారంగా ఉన్నాయి.

వైయస్ఆర్ జలకళ ద్వారా మరో 5 లక్షల ఎకరాలకు బోరు బావుల ద్వారా నీటిని అందించాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇందుకోసం 2 లక్షల బోర్లు ఉచితంగా వేయిస్తామని ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. రెండున్నర ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతులు ఇబ్బంది పడకుండా ఇద్దరు కానీ ముగ్గురు రైతులు కలసి ఏకాభిప్రాయంతో బోరు బావి కోసం ప్రభుత్వానికి  దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి  జియాలజిస్టు ఆమోదం లభించిన తర్వాతే డ్వామా ఏపీడీ అనుమతితో స్థానికంగా కాంట్రాక్టర్ ద్వారా బోరు బావిని తవ్విస్తారు.

మొదటిసారి బోరు వేసే క్రమంలో నీరు పడకపోతే, రెండోసారి కూడా అవకాశం వుంటుంది. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ కి బోరుకు అయిన ఖర్చుని ప్రభుత్వం చెల్లిస్తుంది. బోర్లతో పాటు అందుకు కావాల్సిన కరెంట్ మీటర్లు కూడా ఉచితంగా బిగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు ప్రయోజనకరంగా ఉండే విధానాలనే తాము అనుసరిస్తున్నామని.. రైతు శ్రేయస్సే తమకు ముఖ్యమంటూ ఇలాంటి ఎన్నో పథకాలతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది.

ఈ క్రింది వెబ్ సైట్ లింక్ ద్వారా కొత్తగా బోరు కోసం నమోదు చేసుకోవటమే కాకుండా చేసుకున్న ధరఖాస్తు గురించిన వివరాలను కూడ తెలుసుకోవచ్చు.

http://ysrjalakala.ap.gov.in/YSRRB/UserInterface/Application/Admin/BeneficiaryRegistrationPublic.aspx