700 కి.మీ. ప్రయాణించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌

  • నరసరావుపేట ప్రభుత్వాసుపత్రి నుంచి బయలుదేరుతున్న తల్లీ, బిడ్డ, భర్త
  • కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని సొంత గ్రామానికి చేరిన బాలింత

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట వంద పడకల ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ కాన్పు అయిన మహిళా కూలీని ప్రసవానంతరం సుమారు 350 కిలోమీటర్ల దూరంలోని ఆమె సొంత గ్రామానికి తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా వదిలి పెట్టి వచ్చిన ఘటన ఇది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నేలతలమర్ర గ్రామం నుంచి గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలో మిరపకాయలు కోసేందుకు జె.యశోద తన భర్తతో కలిసి వచ్చింది.

నిండు గర్భిణిగా ఉన్న ఆమెకు నొప్పులు రావడంతో 108 ద్వారా నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చారు. ఇక్కడి డాక్టర్లు సురక్షితంగా ఆమెకు సాధారణ కాన్పు చేయగా బిడ్డను ప్రసవించింది. మూడు రోజుల అనంతరం వైద్యశాల నుంచి బిడ్డతో సహా ఆమెను సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంత గ్రామానికి తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ఉచితంగా తీసుకెళ్లి వదిలి పెట్టి వచ్చారు. దీనిద్వారా తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ రానూపోను 700 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇలాంటి సర్వీసును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ యాజమాన్యానికి వారు ధన్యవాదాలు తెలిపారు.  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/700-km-travelingysr-thallibidda-express-kurnool-narasaraopeta-1447917