వైయస్ఆర్ ఆసరా

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన పాదయాత్రలో మహిళల కష్టాలు ఎన్నో చూశారు. అందుకే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన క్షణమే ఆ కన్నీళ్లు తుడవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆర్థికంగా అండగా ఉండాలన్న భావనతో  వైయస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ.. మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిరూపించారు. మహిళా సంఘాల డ్వాక్రా రుణాలు అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిస్తామని హామీ ఇచ్చిన మాట ప్రకారం ఈ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు.

      ఈ పథకంలో భాగంగా 87లక్షల మంది మహిళలకు సంబంధించి  27 వేల కోట్ల రుణాలను నాలుగు విడతల్లో చెల్లిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల 71 వేలకు పైగా పొదుపు సంఘాలలో 87లక్షల 74వేల మందికి పైగా మహిళల బ్యాంకు ఖాతాలలో ఉన్న అప్పు 27వేల 168 కోట్లకు పైగా నగదును పొదుపు ఖాతాలో నాలుగు విడతల్లో జమ చేసారు. వైఎస్ఆర్ ఆసరా పథకం లబ్ధిదారుల జాబితాను సెర్ఫ్, మెప్మా వెబ్ సైట్ల్లతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర ప్రదర్శిస్తారు. ఎవరికైనా అర్హత ఉండి ఆసరా జాబితాలో పేరు రాకపోతే తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని అక్కచెల్లెమ్మలకే వదిలేస్తున్నామని, బ్యాంకర్లు ఆ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని సర్కార్‌ స్పష్టం చేసింది. 2014లో చంద్రబాబు ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ భేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. దీంతో మహిళల అప్పులు తీరక, వాటిపై వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయాయి. ఫలితంగా అప్పట్లో సుమారు రెండు లక్షల పొదుపు సంఘాలు బ్యాంకుల వద్ద నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)గా ముద్ర వేయించుకున్నాయి. ఏ గ్రేడ్‌లో ఉండాల్సిన దాదాపు 5 లక్షల సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి. దీనికితోడు అప్పటి టీడీపీ ప్రభుత్వం జీరో వడ్డీ డబ్బులు రూ.3,036 కోట్ల మేర చెల్లించలేదు. వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక సున్నా వడ్డీ పథకం కింద గత ఏడాది రూ.1,400 కోట్లు చెల్లించింది. తాజాగా వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత వంటి పథకాల వల్ల పొదుపు సంఘాల వ్యవస్థ తిరిగి గాడిలో పడింది. దీంతో ఇప్పుడు 99.27 శాతం రుణాలను సకాలంలో చెల్లిస్తున్నాయి.