వ్యాక్సినేషన్ లో ఏపీ ముందడుగు

  • ఒకేరోజు 13.59 లక్షల మందికిపైగా కోవిడ్‌ వ్యాక్సిన్లు సామర్థ్యాన్ని చాటిన ఏపీ
  • గతంలో ఒకేరోజు 6.32 లక్షలు.. ఈసారి రెట్టింపయిన వేగం 
  • తగినన్ని వ్యాక్సిన్లుంటే ఎంత త్వరగా వేయగలమో చూపించిన ఏపీ
  • మనకంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లోనూ ఒకేరోజు ఇన్ని డోసులు వేయలేదు
  • కలిసి వస్తున్న గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేల యంత్రాంగం
  • ఆశా కార్యకర్తలు, గ్రామ వలంటీర్లు, ఏఎన్‌ఎంల భాగస్వామ్యంతో రికార్డు
  • ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులు, 45 ఏళ్లు దాటిన వారికి టీకా
  • ఇప్పటిదాకా 1.36 కోట్ల డోసులకు పైగా టీకాలిచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడి

   కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ తన రికార్డును తానే అధిగమించింది. గతంలో ఒకేరోజు 6.32 లక్షల డోసులు టీకాలు వేసి దేశంలోనే రికార్డు సృష్టించగా  ఆదివారం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సిన్‌ డ్రైవ్‌ అంచనాలకు అందని రీతిలో విజయవంతమైంది. తాజాగా ఒక్కరోజే 13,59,300 మందికి టీకాలు వేశారు. దీంతో ఒకేరోజు ఎక్కువ సంఖ్యలో టీకాలు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్‌ తన రికార్డును తానే అధిగమించింది. రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థ.. పక్కా ప్రణాళిక.. సమన్వయం.. అన్నిటికీ మించి చిత్తశుద్ధి టీకాల క్రతువు విజయవంతం కావటానికి కారణాలు.

  ప్రణాళికతో… పోటాపోటీగా
  ఉదయం 8 గంటలకు ప్రారంభమైన టీకాల ప్రక్రియ రాత్రి 9 గంటల వరకూ కొనసాగింది. వార్డు/గ్రామ సచివాలయాలు మొదలుకొని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల వరకూ సీవీసీ (కోవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌)లు ఏర్పాటు చేసి భారీగా టీకాలు వేశారు. వలంటీర్లు, ఆశా వర్కర్లు ఉదయం నుంచే 45 ఏళ్లు దాటిన వారు, ఐదేళ్లలోపు చిన్నారులు తల్లులకు టీకాలు ఇప్పించడంలో నిమగ్నమయ్యారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద టీకాల ప్రక్రియ నిర్వహించారు. వ్యాక్సిన్‌ కారణంగా దుష్ఫలితాలు చోటు చేసుకున్నట్లు ఎక్కడా ఘటనలు నమోదు కాలేదు. అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో పోటీపోటీగా టీకాల ప్రక్రియ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌ కంటే ఎక్కువ జనాభా కలిగిన ఏ రాష్ట్రంలోనూ ఒకేరోజు ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు వేసిన సందర్భాలు లేవు. నాలుగు రోజుల ముందునుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించి పెద్దసంఖ్యలో టీకాలు ఇవ్వగలిగారు. టీకాలు పొందిన వారిలో మొదటి డోసువారితో పాటు రెండో డోసు వారూ ఉన్నారు.

  1.36 కోట్ల డోసులు దాటిన టీకా
  రాష్ట్రంలో ఈనెల 19వతేదీ సాయంత్రానికి 1,23,16,609 డోసులు వేశారు. ఆదివారం ఇచ్చిన 13,59,300 డోసులు దీనికి అదనం. దీంతో ఇప్పటిదాకా 1,36,75,909 డోసులు ఇచ్చినట్లైంది. దీనిద్వారా ఆంధ్రప్రదేశ్‌ సామర్థ్యం మరోసారి రుజువైంది. సకాలంలో టీకాలు అందచేస్తే మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా వ్యాక్సినేషన్‌ నిర్వహించనున్నట్లు నిరూపితమైంది. ఆరోగ్యశాఖతోపాటు గ్రామ/వార్డు సచివాలయాల  సిబ్బంది భాగస్వామ్యంతో ఇంత భారీస్థాయిలో టీకాలు వేయగలిగారు.

  ‘పశ్చిమ’ టాప్‌… చివరిలో విజయనగరం
  అన్ని జిల్లాల్లోనూ ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు పెద్ద సంఖ్యలో టీకాలు తీసుకున్నారు. విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్తున్న వారు కూడా టీకాలు పొందారు. అత్యధికంగా  పశ్చిమ గోదావరి జిల్లాలో 1.64 లక్షల మందికి పైగా టీకాలు ఇవ్వగా అత్యల్పంగా 63 వేల మందికి విజయనగరం జిల్లాలో టీకాలు ఇచ్చారు.

  4,589 సెంటర్లలో వ్యాక్సినేషన్‌..
  రాష్ట్రవ్యాప్తంగా 4,589 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. భారీ స్థాయిలో సిబ్బంది ఇందులో భాగస్వాములయ్యారు. ఆరోగ్యశాఖకు చెందిన 28,917 మంది సిబ్బందితోపాటు 40 వేల మంది ఆశా కార్యకర్తలు రాత్రి వరకు విధులు నిర్వహించారు. ఇతర విభాగాలకు చెందిన మరో 5 వేల మంది సిబ్బంది టీకా ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేసినట్లు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ‘సాక్షి’కి తెలిపారు.

  జిల్లాలవారీగా ఆదివారం ప్రత్యేక వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ఇలా

  గణనీయంగా తగ్గిన కేసులు
  ► చిన్నపిల్లలకు చికిత్సపై వైద్య సిబ్బందికి శిక్షణ: సింఘాల్‌
  ► వ్యాక్సిన్ల వినియోగంలో వృథా లేదు
  ► నేడు రాష్ట్రానికి మరో 2 లక్షల డోసులు

  తిరుపతి తుడా: రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టి 24 వేల నుంచి 6 వేల దిగువకు వచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుపతిలో స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను కలెక్టర్‌ హరినారాయణన్, నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీష, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీహరితో కలసి ఆయన పరిశీలించారు. టీకాలు తీసుకునేందుకు వచ్చిన వారిని పలకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా థర్డ్‌ వేవ్‌ రాకూడదని కోరుకుంటున్నామని, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పారు. ఐసీయూ, ఆక్సిజన్‌ పడకల సామర్థ్యాన్ని పెంచామని, ఆగస్టు నాటికి ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా పటిష్ట ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. 100 బెడ్లు కలిగిన ప్రతి ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టి రూ.350 కోట్లతో టెండర్లు పిలిచినట్లు వివరించారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌తో పాటు ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచనున్నట్లు  తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారంలో మూడు రోజుల పాటు కోవిడ్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు.
   
  అందుబాటులో ఇంజక్షన్లు..

  థర్డ్‌ వేవ్‌లో పిల్లలపై వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండదని అంచనా వేస్తున్నట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ పేర్కొన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తగా పీడియాట్రిక్‌ సీనియర్‌ వైద్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని నియమించినట్లు తెలిపారు. చిన్నపిల్లల చికిత్సపై వైద్య సిబ్బందికి శిక్షణ ప్రక్రియను చేపట్టనున్నట్లు చెప్పారు. కోవిడ్‌ చికిత్సకు రెమ్‌డిసివర్, బ్లాక్‌ ఫంగస్‌కు ఎంఫోటెరిసిస్‌–బి లాంటి ఇంజెక్షన్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఇబ్బంది లేదని 770 మందికి బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స అందించామని తెలిపారు. మాస్కులు, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడంపై ఉద్యమం తరహాలో అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు. ఒంగోలులోని రామ్‌నగర్‌ మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సింఘాల్‌ సాయంత్రం పరిశీలించారు. వ్యాక్సిన్ల వినియోగంలో ఎక్కడా వృథా జరగలేదని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్రానికి మరో 2 లక్షల డోసులు రానున్నట్లు వెల్లడించారు.

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/andhra-pradesh-vaccinates-record-1359-lakh-people-day-1372700